
సచిన్ కు మరపురాని రోజు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రీడాజీవితంలో ఈరోజు మరపురాని జ్ఞాపకం. 1989 నవంబర్ 15న ‘లిటిల్ మాస్టర్’ టెస్టు కెరీర్ ప్రారంభమైంది. కరాచీ నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో సచిన్ అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్ లో ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగిన ‘మాస్టర్ బ్లాస్టర్’ 15 పరుగులు చేసి వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ యూనిస్ కూడా ఇదే మొదటి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. భారత ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోల, పాక్ ప్లేయర్ షాహిద్ సయీద్ కూడా ఇదే మ్యాచ్ తో టెస్టుల్లో అరంగ్రేటం చేశారు.
16 ఏళ్ల 205 రోజుల చిన్న వయసులో సచిన్ టెస్టు కెరీర్ ప్రారంభించాడు. తన విశేష ప్రతిభతో టెండూల్కర్ తర్వాత తిరుగులేని క్రికెటర్ గా ఎదిగాడు. భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేశాడు. 24 ఏళ్ల పాటు క్రికెట్ లో కొనసాగిన సచిన్ ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. 200 టెస్టులు ఆడి 53.78 సగటుతో 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు, 68 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో సచిన్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 248 నాటౌట్. 46 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ పేరిటే ఉంది. అత్యుత్తమ ఆటతీరు, ఒద్దికైన వ్యక్తిత్వంతో సచిన్ ‘క్రికెట్ దేవుడి’గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు.