
ధోనీ కారును ఓ అమ్మాయి ఛేజ్ చేసి..
రాంచీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంతూరు రాంచీలోని ఉమెన్స్ కాలేజీ విద్యార్థిని ఆరాధ్యకు అతనితో సెల్ఫీ దిగాలన్నది కల. ఆరాధ్య కోరిక నెరవేరే రోజు ఇటీవల వచ్చింది. అయితే ఆమె దీనికోసం చిన్న సాహసమే చేసింది.
రాంచీలో జరిగిన భారత్-న్యూజిలాండ్ నాలుగో వన్డే తర్వాత గత నెల 26న ధోనీ తన హమ్మర్ కారులో విమానాశ్రయానికి బయల్దేరాడు. ఈ విషయం తెలుసుకున్న ఆరాధ్య స్కూటీ వేసుకుని ధోనీ కారును ఫాలో అయ్యింది. మధ్యలోనే ధోనీ కారును ఛేజ్ చేసిన ఆరాధ్య విమానాశ్రయం వరకు అలాగే ఆగకుండా వెళ్లింది. ధోనీ విమనాశ్రయం చేరుకోగానే టర్మినల్ వద్ద ఆరాధ్య అతణ్ని కలసి తన సెల్ఫీ కోరికను చెప్పింది. ధోనీ ఆమె మాటను మన్నించి సెల్ఫీ దిగాడు. ఆరాధ్య ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ముచ్చట తీర‍్చుకుంది.