
నన్ను అందరూ వేలెత్తి చూపారు: హర్భజన్
గతంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్లో క్రికెటర్ శ్రీశాంత్ను చెంప దెబ్బ కొట్టడం తప్పేనని ఒప్పుకున్నాడు టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్.
ఢిల్లీ: గతంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్లో క్రికెటర్ శ్రీశాంత్ను చెంప దెబ్బ కొట్టడం తప్పేనని ఒప్పుకున్నాడు టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్. అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపిన ఈ ఘటనపై హర్భజన్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అసలు అది జరగకుండా ఉండాల్సిందని తన తప్పును మరోసారి సరిదిద్దుకునే యత్నం చేశాడు. ఆప్ కీ అదాలత్ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్వూలో హర్భజన్.. ఆనాటి తప్పునుంచి పెద్ద గుణపాఠం నేర్చుకున్నానన్నాడు. జీవితంలో చాలా తప్పులు చేసిన వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకోవడానికి యత్నిస్తుంటానని తెలిపాడు.
'నేను చేసిన తప్పుల్లో శ్రీశాంత్ ఘటన కూడా ఒకటి. ఆ ఘటనతో చాలా కలవర పడ్డా. నేను బలంగా కొట్టడంతో అతను ఏడ్వడం ఆరంభించాడు. నేను తప్పు చేశానని ప్రతీ ఒక్కరూ వేలెత్తి చూపిన సందర్భం అది. జీవితంలో చాలా తప్పులు చేశా. వాటి నుంచి పాఠం నేర్చుకున్నానని చాలా ఇంటర్య్వూల్లో చెప్పాను. మళ్లీ అదే చెబుతున్నా. నేను తప్పు చేసిన అనంతరం మదనపడివాడ్ని'అని హర్భజన్ పేర్కొన్నాడు.