'వాటి విలువ 500 పరుగులు'
చెన్నై:ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పేలవమైన ఫీల్డింగ్ పట్ల ఆ జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కొన్ని క్యాచ్లను వదిలేయడంతోనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నాడు. తమ ఆటగాళ్ల ఫీల్డింగ్ స్థాయి చాలా కింద వరుసలో ఉందంటూ అసహనం వ్యక్తం చేశాడు.
' మేము మంచి క్రికెటర్లమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే స్లిప్ లో మంచి ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లు మా జట్టులో లేరనే చెప్పాలి. మా జట్టులో సహజసిద్ధమైన అథ్లెట్లు ఎవ్వరూ లేరనే నేను అనుకుంటున్నా. ఈ క్రమంలోనే కొన్ని క్యాచ్లను వదిలేశాం. ప్రధానంగా చివరి టెస్టు భారత తొలి ఇన్నింగ్స్ లో మూడు కీలక క్యాచ్లను మా ఆటగాళ్లు వదిలేశారు. వాటి విలువ 500 పరుగులు అనే విషయం మా జట్టు సభ్యులు తెలుసుకుంటే మంచింది. ఏది ఏమైనా ఇక్కడ భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసింది. గత కొంతకాలంగా ఉప ఖండ పిచ్ల్లో ఆడుతున్నా, ఆ రకమైన వాతావరణానికి మా ఆటగాళ్లు పూర్తిగా అలవాటు పడలేదు. దాంతోనే మేము ఆశించిన ఫలితాలు రాలేదు. బంగ్లాదేశ్ పర్యటన మొదలుకొని, భారత టెస్టు సిరీస్లో మా జట్టు పూర్తిగా వైఫల్యం చెందింది. మా పేలవమైన ప్రదర్శనపై తీవ్రస్థాయిలో కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది'అని బేలిస్ పేర్కొన్నాడు.