
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది. పీసీబీ అవినీతి నిరోధక విభాగం అతనిపై రెండు నెలలుగా విచారించింది. చివరకు సోమవారం శిక్ష ఖరారు చేసింది. అయితే ఉమర్‌పై నిషేధం విధించడానికి గల స్పష్టమైన కారణాలను పీసీబీ వెల్లడించలేదు. కానీ బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో వేటు వేశామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ ఫిబ్రవరిలో ఉమర్ అక్మల్ రెండు అనుచిత, అసందర్భ ఘటనలకు బాధ్యుడయినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. అందుకే మూడేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. పాక్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో అతని సందేహాస్పద ప్రవర్తనే నిషేధానికి కారణం కావొచ్చని తెలిసింది. 29 ఏళ్ల ఉమర్ అక్మల్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కమ్రాన్ అక్మల్‌కు సొంత తమ్ముడు. ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు కూడా వరుసకు సోదరుడవుతాడు. ఉమర్ అంతర్జాతీయ కెరీర్‌లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment