వైదొలిగిన వికాస్..కాంస్యంతో సరి
బాకు(అజెర్ బైజాన్):ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబా) ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్(75 కేజీ) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీ ద్వారా రియో ఒలింపిక్స్ బెర్తును దక్కించుకున్న వికాస్.. గాయం కారణంగా సెమీ ఫైనల్ పోరు నుంచి వైదొలిగాడు. దీంతో కాంస్య పతకానికే పరిమితమయ్యాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో వికాస్ 3-0తో లీ డోంగ్యున్ (కొరియా)ను ఓడించి రియోకు అర్హత సాధించాడు. అయితే ఈ పోరులో గాయపడ్డ వికాస్ సెమీ ఫైనల్ పోరుకు సిద్ధంగా లేడని టోర్నీ డాక్టర్లు అధికారికంగా ధృవీకరించారు. అతని కంటి పైభాగాన కుట్లు పట్టడంతో సెమీ ఫైనల్ పోరుకు దూరమైనట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా మరో భారత బాక్సర్ మనోజ్ కుమార్(64కేజీ) కూడా రియోకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో మనోజ్ 3-0తో రఖిమోవ్ షవ్‌కట్‌జోన్ (తజకిస్తాన్)పై నెగ్గి సెమీస్ కు చేరాడు. దీంతో అతను 64 కేజీల కేటగిరీలో ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగే సెమీ ఫైనల్లో యూరోపియన్ చాంపియన్ పాట్ మెక్- కార్మాక్(బ్రిటన్)తో మనోజ్ తలపడనున్నాడు. మరోవైపు దేవెంద్రో సింగ్(49కేజీ) ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే సెమీ ఫైనల్ అడ్డంకిని అధిగమించాల్సి ఉంది.