జోహన్నెస్‌బర్గ్ : మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లుంది ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి. ఇప్పటికే ట్యాంపరింగ్ వివాదంతో సీనియర్ ఆటగాళ్లైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్‌లపై నిషేధంతో జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో జట్టు పగ్గాలను యువ ఆటగాడు, వికెట్ కీపర్ టీమ్ పెయిన్‌కు అప్పగించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో ఈ యువ సారథి గాయపడ్డాడు.
రెండో రోజు ఆటలో ఆసీస్ అరంగేట్ర ఆటగాడు చాద్ సేయర్స్ వేసిన బంతిని అందుకునే ప్రయత్నంలో టీమ్ పెయిన్ కుడి బొటన వేలికి ఫ్రాక్చర్ అయ్యింది. గాయంతో విలవిలాడిన అతను అసౌకర్యంగానే మ్యాచ్‌లో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌లో సైతం ఆర్డర్ మార్చుకుని 7వ స్థానంలో బరిలోకి దిగాడు.
అయితే అతని బొటన వేలు చిట్లినట్లు ఫిజియోలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సైతం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అతను ఈ టెస్టు చివరి వరకు కొనసాగడం కష్టంగా మారింది. ఏ నిమిషంలోనైనా సిరీస్ నుంచి వైదొలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ టెస్టు ఆరంభం ముందే స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కాలి గాయంతో సిరీస్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment