నా నిర్ణయం సరైనదే:మెకల్లమ్
క్రిస్ట్చర్చ్: తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని న్యూజిలాండ్ డాషింగ్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ స్పష్టం చేశాడు. సరైన సమయంలోనే క్రికెట్ నుంచి బయటకొచ్చినట్లు రెండో టెస్టులో కివీస్ ఓటమి అనంతరం మెకల్లమ్ పేర్కొన్నాడు. తన చివరి ప్రదర్శన సంతృప్తి నిచ్చినా ఓటమి మాత్రం బాధించిందన్నాడు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మెకల్లమ్ 54 బంతుల్లో 100 పరుగులుచేసి 34 ఏళ్ల రికార్డును తిరగరాసిన సంగతి తెలిసిందే. వివ్ రిచర్డ్స్ (56 బంతుల్లో; ఇంగ్లండ్‌పై 1986లో), మిస్బా వుల్ హక్ (56 బంతుల్లో; ఆస్ట్రేలియాపై 2014లో) పేరిట ఉన్న రికార్డును మెకల్లమ్ బద్దలు కొట్టాడు.
ఓవరాల్ గా ఈ ఇన్నింగ్స్ లో మెకల్లమ్ (145;79 బంతుల్లో 21 ఫోర్లు,6 సిక్సర్లు) భారీ సెంచరీ నమోదు చేశాడు. కాగా, రెండో ఇన్నింగ్స్ లో మెకల్లమ్ ( 27 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ఓ మోస్తరు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండో టెస్టు బుధవారం ఆఖరి రోజు ఆటలో ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కివీస్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని స్మిత్ సేన 54 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో పాటు టెస్టుల్లో ఆసీస్ నంబర్‌వన్ గా అవతరించింది.