తాహీర్‌ ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నా! | Tired Of Seeing Tahir Celebrations, Colin Munro | Sakshi
Sakshi News home page

తాహీర్‌ ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నా!

Published Mon, Mar 9 2020 12:46 PM | Last Updated on Mon, Mar 9 2020 1:17 PM

Tired Of Seeing Tahir Celebrations, Colin Munro - Sakshi

రావల్పిండి: దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన లెగ్‌ బ్రేక్‌లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే తాహీర్‌.. వికెట్‌ తీసిన సందర్భంలో సంబరాలు చేసుకోవడం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. వికెట్‌ తీస్తే చాలు రెండు చేతులను చాచుకుంటూ మైదానంలో కలియదిరుగుతాడు. అయితే తాహీర్‌ ఈ తరహా సెలబ్రేషన్స్‌ను చూడలేకపోతున్నామంటున్నాడు న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కొలిన్‌ మున్రో. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో భాగంగా ఆదివారం ముల్తాన్‌ సుల్తాన్స్‌- ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇస్లామాబాద్‌ తరఫున మున్రో ఆడుతుండగా, ముల్తాన్‌ సుల్తాన్స్‌ తరఫున తాహీర్‌ ఆడుతున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో మున్రోను ఔట్‌ చేసిన తర్వాత తాహీర్‌ తన సెలబ్రేషన్స్‌కు పని చెప్పాడు. ఈ క్రమంలోనే తాహీర్‌కు మున్రోకు మాటల యుద్ధం జరిగింది. పెవిలియన్‌కు వెళుతూ మున్రో ఏదో అనగా, దానికి తాహీర్‌ రిప్లే ఇచ్చాడు. 

అయితే దీనిపై పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ సాజ్‌ సాదిక్‌.. మున్రోను వివరణ కోరగా తాహీర్‌ ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నామనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ‘ నేను తాహీర్‌ సెలబ్రేషన్స్‌ చూడలేకపోతున్నా. ఆ సెలబ్రేషన్స్‌ చూసి చూసి అలసిపోయా. సర్కస్‌లో చేసే ఫీట్‌లా ఉంటుంది అతని సెలబ్రేషన్‌. అది సరైన సెలబ్రేషన్స్‌ కాదు. అతను నాతో వాగ్వాదానికి దిగిన క్రమంలో ఎలా ప్రవర్తించాడో మీరు చూశారు కదా. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం’ అని అన్నాడు.

ఈ మ్యాచ్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ 9 వికెట్ల తేడాతో(డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం) విజయం సాధించింది. ఇస్లామాబాద్‌ నిర్దేశించిన 92 పరుగుల టార్గెట్‌ను ముల్తాన్‌ సుల్తాన్స్‌ వికెట్‌ కోల్పోయి ఛేదించింది. జేమ్స్‌  విన్సే(61 నాటౌట్‌) ముల్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ముల్తాన్‌ సుల్తాన్స్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. పీఎస్‌ఎల్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ ప్లేఆఫ్‌కు చేరడం ఇదే తొలిసారి. కాగా, ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టు కూడా సుల్తాన్సే.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement