ప్రాంజల జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది. థాయ్‌లాండ్‌లో శనివారం జరిగిన మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన జీల్ దేశాయ్‌తో కలిసి ప్రాంజల టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఫైనల్లో ప్రాంజల–జీల్ దేశాయ్ ద్వయం 6–2, 7–5తో రుతుజా భోస్లే (భారత్)–అలెగ్జాండ్రా వాల్టర్స్ (ఆస్ట్రేలియా) జంటపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది ప్రాంజలకిది రెండో డబుల్స్ టైటిల్. గత జూన్‌లో ఔరంగాబాద్‌లో జరిగిన టోర్నీలో జియావోజి జావో (చైనా)తో కలిసి ప్రాంజల తొలి టైటిల్‌ను నెగ్గింది. మరోవైపు డబుల్స్‌లో ఓడినప్పటికీ... సింగిల్స్‌లో రుతుజా భోస్లే విజేతగా నిలిచింది. ఫైనల్లో రుతుజా 6–4, 2–6, 7–5తో హువా చెన్ లీ (చైనీస్ తైపీ)పై గెలిచింది.
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు జ్యోతి సురేఖ
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ‘అర్జున’ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ... మెక్సికోలో అక్టోబర్ 15 నుంచి 22 వరకు జరిగే ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. సోనెపట్‌లో జరిగిన సెలక్షన్స్‌లో ఆమె రికార్డు విజయాన్ని సాధించింది. శనివారం నిర్వహించిన ఒలింపిక్ రౌండ్‌లో జ్యోతి సురేఖ నిర్ణీత 150 పాయింట్లకు గానూ 150 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలిచింది.