ఆమ్లా, తాహిర్‌లపై దృష్టి
నేటి నుంచి రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో దక్షిణాఫ్రికా ఢీ
భారత యువ క్రికెటర్లకు గొప్ప అవకాశం
ముంబై: దక్షిణాఫ్రికా జట్టు టి20, వన్డే సిరీస్‌లు గెలుచుకున్నా... ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ ఆమ్లాతో పాటు స్పిన్నర్ తాహిర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అయితే టెస్టుల్లో దక్షిణాఫ్రికా అవకాశాలు బాగుండాలంటే కచ్చితంగా ఈ ఇద్దరే కీలకం. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌పై ఈ ఇద్దరూ దృష్టి సారించారు. టెస్టుల్లో జట్టు సారథిగానూ వ్యవహరించే ఆమ్లా ఓ భారీ ఇన్నింగ్స్‌తో గాడిలో పడటం కీలకం. వన్డే జట్టుతో పోలిస్తే జట్టులో కొద్దిగా మార్పులు ఉన్నాయి. డుఫ్లెసిస్, డివిలియర్స్‌లకు పెద్దగా సమస్య లేదు. బావుమా, హార్మర్, ఎల్గర్‌లాంటి క్రికెటర్లకు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వడం ద్వారా పరిస్థితులకు అలవాటు పడొచ్చని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఇక బౌలింగ్‌లో పేసర్ మోర్నీ మోర్కెల్ కోలుకున్నా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాడో లేదో తెలియని సందిగ్దత. స్టెయిన్, ఫిలాండర్, రబడ కూడా ప్రాక్టీస్ కోసం ఆడొచ్చు. ఆఫ్ స్పిన్నర్లు హార్మర్, పిడిట్‌లను కూడా ఈ మ్యాచ్ ద్వారా పరీక్షించే అవకాశం ఉంది.
ఇక ఈ మ్యాచ్ ద్వారా సెలక్టర్ల దృష్టిని ఆక ర్షించాలని భారత యువ క్రికెటర్లు భావిస్తున్నారు. ఈ జట్టుకు పుజారా సారథ్యం వహిస్తుండగా... లోకేశ్ రాహుల్‌తో పాటు కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, నామన్ ఓజాలాంటి బ్యాట్స్‌మెన్ సత్తా చూపించాలని తహతహలాడుతున్నారు. ఇక ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా మీద కూడా అందరి దృష్టి ఉంది. బౌలింగ్‌లో కరణ్ శర్మ, కుల్‌దీప్ యాదవ్‌లతో పాటు ఠాకూర్, జాక్సన్ కూడా కీలకం.
సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన టి20 ప్రాక్టీస్ మ్యాచ్‌లో సఫారీలు భారత యువ జట్టు చేతిలో ఓడిపోయారు. అయితే అసలు సిరీస్‌లో మాత్రం భారత్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈ మ్యాచ్ ఫలితం కంటే... టెస్టులకు సన్నాహకంగా ఉపయోగించుకోవడం దక్షిణాఫ్రికా లక్ష్యం.