
వుహాన్ (చైనా): ఐదున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో ఇప్పటివరకు మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఎవరూ టైటిల్ సాధించలేదు. పురుషుల సింగిల్స్ విభాగంలో మాత్రం 1965లో దినేశ్ ఖన్నా ఏకైకసారి విజేతగా నిలిచాడు. ఆ తర్వాత ఈ విభాగంలోనూ భారత్‌కు స్వర్ణం రాలేదు. కొంతకాలంగా భారత క్రీడాకారులు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో నిలకడగా రాణిస్తున్న నేపథ్యంలో ఈసారి ఈ మెగా ఈవెంట్‌లో వారు ఎలాంటి ప్రదర్శన చేస్తారో ఆసక్తికరంగా మారింది. 2010, 2016లలో సెమీఫైనల్లో ఓడిపోయిన సైనా... 2014లో పీవీ సింధు కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో వీరిద్దరికిదే అత్యుత్తమ ప్రదర్శన.
ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన సైనా... రన్నరప్‌గా నిలిచిన సింధు తమ అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తేనే ఆసియా పోటీల్లో వారి నుంచి మళ్లీ పతకాలు ఆశించవచ్చు. టోర్నీ తొలి రోజు మంగళవారం కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో సైనా... పాయ్ యు పో (చైనీస్ తైపీ)తో పీవీ సింధు తలపడతారు. తొలి రౌండ్‌ను దాటితే రెండో రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ ఒకుహారా (జపాన్)తో సైనా... చైనా ప్లేయర్ చెన్ జియోజిన్‌తో సింధు ఆడే అవకాశముంది. క్వాలిఫయింగ్‌లో మరో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ బరిలో ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో విశేషంగా రాణించిన డబుల్స్ క్రీడాకారులు అశ్విని పొన్నప్ప, సాత్విక్ సాయిరాజ్, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రా ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ టాప్ సీడ్ హోదాలో పోటీపడుతున్నాడు. తొలి రౌండ్‌లో నిషిమోటో (జపాన్)తో శ్రీకాంత్ ఆడతాడు. సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రణయ్ కూడా ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్‌లో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో సమీర్ వర్మ; అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్; క్వాలిఫయర్‌తో ప్రణయ్ తలపడతారు. ఈ మెగా ఈవెంట్‌లో 2000లో పుల్లెల గోపీచంద్, 2007లో అనూప్ శ్రీధర్ కాంస్య పతకాలు గెలిచిన తర్వాత మరో భారత్ ప్లేయర్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment