
పధ్నాలుగేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ధోని వన్డే బ్యాటింగ్‌పై విమర్శలు వచ్చిన సందర్భాలు చాలా అరుదు. అలాంటివి ఎప్పుడు వచ్చినా వాటిని వెంటనే తన ఆటతోనే అతను బదులిచ్చాడు. కానీ సిడ్నీ వన్డే తర్వాత అన్ని వేళ్లు అతని వైపే తిరిగాయి. 10 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు సాధించిన ధోని రెండోసారి మాత్రమే 60కంటే తక్కువ స్ట్రయిక్‌రేట్‌తో అర్ధ సెంచరీ చేశాడు.
వరల్డ్ కప్ చేరువవుతున్న తరుణంలో ఒకవైపు బ్యాటింగ్‌లో తడబాటు, మరోవైపు రిషభ్ పంత్ ఇటీవలి ప్రదర్శనతో బహుశా ధోని కూడా ఒత్తిడికి గురవుతున్నాడేమో. ఇప్పుడు రెండో వన్డేలో గెలిచి సిరీస్ కాపాడుకోవడంతో పాటు అందరి దృష్టి ధోనిపైనే నిలిచింది. ఈ నేపథ్యంలో భారత బ్యాట్స్‌మెన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం.
అడిలైడ్
ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచిన ఉత్సాహంతో వన్డే సిరీస్ బరిలోకి దిగిన భారత్‌కు తొలి మ్యాచ్‌లో అనూహ్య ఫలితం ఎదురైంది. భారత్‌తో పోలిస్తే ఎన్నో అంశాల్లో అనుభవం తక్కువగా ఉన్న ఆసీస్ ముందు టీమిండియా తలవంచింది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన రెండో వన్డేలో నేడు భారత్, ఆస్ట్రేలియాతో తలపడుతోంది. టెస్టు సిరీస్ విజయానికి తొలి అడుగు పడిన అడిలైడ్‌లో మరో గెలుపును అందుకోవాలని కోహ్లి సేన ఆశిస్తుండగా... వన్డే సిరీస్ గెలవగలిగితే అది తమ జట్టుకు గొప్ప ఘనతగా ఆసీస్ బృందం భావిస్తోంది.
జాదవ్‌కు అవకాశం!
గత మూడేళ్లుగా భారత టాప్–3 బ్యాట్స్‌మెన్ జట్టుకు అద్భుత విజయాలు అందించారు. రోహిత్, ధావన్, కోహ్లిలలో కనీసం ఇద్దరు చెలరేగడంతో మన జట్టు ఎదురు లేకుండా గెలుపు యాత్ర కొనసాగించింది. తొలి వన్డేలో కూడా రోహిత్ అద్భుత సెంచరీ సాధించాడు. అయితే అది విజయానికి సరిపోలేదు. స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లి వైఫల్యం అందులో ఒక కారణం కాగా, మన మిడిలార్డర్ పేలవ ప్రదర్శన జట్టును దెబ్బ తీసింది. ఈ మ్యాచ్‌లో ఆ పొరపాట్లు దిద్దుకుంటే భారత్‌కు గెలుపు అవకాశాలు ఉంటాయి. మిడిలార్డర్‌లో ధోని తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించాల్సి ఉంటుంది.
గత మ్యాచ్‌లో పరిస్థితులను బట్టి నెమ్మదిగా ఆడాడని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినా... కచ్చితంగా ధోని ఆటలో మునుపటి వాడి లేదన్నది వాస్తవం. మ్యాచ్‌ల మధ్యలో సుదీర్ఘ విరామం, తగినంత ప్రాక్టీస్ లేకపోవడం కూడా అందుకు కారణం. తనలో సత్తా ఉండటం వల్లే వరల్డ్ కప్ వరకు కొనసాగే ఆలోచన ఉంది తప్ప పాత ఘనతతో మాత్రం కాదని ధోని కూడా నిరూపించుకోవాల్సి ఉంది. తెలుగు తేజం అంబటి రాయుడుకు తొలి మ్యాచ్ అచ్చి రాలేదు.
అయితే ఆసియా కప్‌లో, ఆ తర్వాత సొంతగడ్డపై విండీస్‌తో కూడా చెలరేగిన రాయుడు మళ్లీ ఫామ్‌లోకి రావడం కష్టం కాకపోవచ్చు. ఆరో స్థానంలో దినేశ్ కార్తీక్ మళ్లీ నిరాశపర్చాడు. అతని స్థానంలో కేదార్ జాదవ్‌కు చోటు దక్కవచ్చు. గత వన్డే అనుభవం నేపథ్యంలో జాదవ్ వేసే కొన్ని ఓవర్లు కూడా జట్టుకు పనికొస్తాయి. బుమ్రా గైర్హాజరు కారణంగా బౌలింగ్‌లో శుభారంభం అందించాల్సిన బాధ్యత భువనేశ్వర్‌పై ఉంది. తొలి మ్యాచ్ తరహాలోనే షమీ బౌలింగ్ చేస్తే ప్రత్యర్థిని భారత్ కట్టడి చేయవచ్చు. కుర్ర ఖలీల్‌కు మరో అవకాశం దక్కవచ్చని అనిపిస్తోంది కానీ ప్రాక్టీస్ సెషన్‌లో సిరాజ్ సుదీర్ఘంగా బౌలింగ్ చేసిన తీరు చూస్తే అరంగేట్రానికి కూడా చాన్స్ ఉంది. జడేజా జట్టులో ఉండటంతో చహల్ మరోసారి పెవిలియన్‌కే పరిమితం కానున్నాడు.
మార్పుల్లేకుండానే...
తొలి వన్డేలో గెలుపుతో ఆస్ట్రేలియా శిబిరంలో కాస్త ఆత్మవిశ్వాసం పెరిగింది. టెస్టు సిరీస్ కోల్పోయిన తర్వాత వచ్చిన ఈ విజయం మళ్లీ ఆసీస్ అభిమానులకు ఊరటనిచ్చింది. మరీ అద్భుతంగా ఆడకపోయినా చక్కటి ప్రణాళికతో ఆడిన కంగారూలు సిడ్నీలో భారత్‌ను ఓడించగలిగారు. ఈసారి అదే తరహాలో ప్రత్యర్థిని పడగొట్టాలని ఆ జట్టు భావిస్తోంది. బౌలింగ్‌తో తొలి మ్యాచ్‌ను శాసించిన పేసర్లు రిచర్డ్‌సన్, బెహ్రన్‌డార్ఫ్‌లు మళ్లీ టీమిండియా టాప్‌ను కుప్పకూల్చాలని పట్టుదలగా ఉన్నారు. సిడిల్, లయన్ కూడా రాణించడంతో జట్టు బౌలింగ్ కూర్పులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
బ్యాటింగ్‌లో కూడా టాప్–6లో ఫించ్ మినహా అందరూ ఆకట్టుకున్నారు. కెప్టెన్ ఫించ్ కూడా ఫామ్‌లోకి వస్తే తిరుగుండదు. ముఖ్యంగా విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్‌వెల్ ఏడో స్థానంలో రావాల్సి వచ్చిందంటే జట్టు బ్యాటింగ్ లోతు అర్థమవుతుంది. ఈసారి మ్యాక్స్‌వెల్‌ను కాస్త ముందుగా పంపే ఆలోచన కూడా ఆసీస్ చేస్తోంది. మిషెల్ మార్‡్ష ఫిట్‌గా ఉన్నా గెలిచిన జట్టును మార్చరాదని టీమ్ మేనేజ్‌మెంట్ దాదాపుగా నిర్ణయించుకుంది.
తుది జట్ల అంచనా
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాయుడు, ధోని, దినేశ్ కార్తీక్/కేదార్ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, షమీ, ఖలీల్/సిరాజ్.
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), క్యారీ, ఖాజా, షాన్ మార్‡్ష, హ్యాండ్స్‌కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, రిచర్డ్‌సన్, లయన్, సిడిల్, బెహ్రన్‌డార్ఫ్.
పిచ్, వాతావరణం
ఇక్కడ జరిగిన గత రెండు వన్డేల్లో తక్కువ స్కోరు నమోదు కాగా, పేస్ బౌలర్లు మంచి ప్రభావం చూపించారు. అయితే సిడ్నీతో పోలిస్తే బౌండరీలు చిన్నవి కాబట్టి భారీ షాట్లకు కూడా అవకాశం ఉంది. వాతావరణం వేడిగా ఉంది. వర్షం సమస్య లేదు.
Comments
Please login to add a commentAdd a comment