మరో ‘అద్భుతం’ జరిగేనా!
►నేడు మహిళల ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్
►ఆస్ట్రేలియాతో భారత్ ‘ఢీ’ ∙సంచలనంపై మిథాలీ సేన దృష్టి
ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఆరుసార్లు చాంపియన్ అయితే భారత్ ఒక్కసారి మాత్రమే ఫైనల్ వరకు చేరగలిగింది.ఏం ఫర్వాలేదు, మరోసారి ఫైనల్ చేరగల సామర్థ్యం మన ఈ జట్టుకు ఉంది. ఇరు జట్ల మధ్య 42 మ్యాచ్‌లు జరిగితే, భారత్ 34 ఓడి, 8 మాత్రమే గెలిచింది. ఆందోళన అనవసరం, క్రికెట్‌లో రికార్డులు తిరగరాయడం అసాధ్యమేమీ కాదు! లీగ్ దశ ఆరంభంలో చెలరేగి ఆ తర్వాత తడబడ్డా... న్యూజిలాండ్‌పై అద్భుత విజయం మన మహిళల జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. అదే స్ఫూర్తితో ఆసీస్‌పై అద్భుతంగా ఆడి మనోళ్లు తుది పోరుకు అర్హత సాధిస్తారా? తన చివరి వరల్డ్ కప్ ఆడుతున్న కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు ఇతర సభ్యులు కూడా తమ కెరీర్‌లో మరో సంచలన విజయంలో భాగమవుతారా?
డెర్బీ: మిథాలీ రాజ్ నేతృత్వంలోనే భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆస్ట్రేలియాతో ముఖాముఖి రికార్డు, టోర్నీ లీగ్ దశలో అదే జట్టు చేతిలో పరాజయం భారత్‌కు ప్రతికూలంగా కనిపిస్తున్నా... అచ్చొచ్చిన మైదానంలో అనూహ్య ఫలితం సాధించగల సత్తా కూడా ‘ఉమెన్ ఇన్ బ్లూ’కు ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ 2005 తర్వాత ప్రపంచకప్‌లో మరోసారి ఫైనల్ చేరినట్లవుతుంది. లీగ్ దశలో భారత్ 5 విజయాలు సాధించగా, ఆస్ట్రేలియా 6 గెలిచింది. ఇరు జట్ల మధ్య పోరులో కంగారూలు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
మంధన ఫామ్‌పై ఆందోళన...
కఠినమైన ప్రత్యర్థే అయినా భారత బ్యాట్స్‌మెన్ తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇస్తే భారత్ భారీస్కోరుకు అవకాశం ఉంటుంది. మరోసారి మిథాలీ రాజ్‌పై భారత్ ఆధార పడుతోంది. జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా ఉన్న మిథాలీ, ఆసీస్‌తో గత మ్యాచ్‌లో మరీ నెమ్మదిగా ఆడి విమర్శలపాలైంది. దానిని సరిదిద్దుకునేందుకు ఆమెకు ఇది మంచి అవకాశం. అయితే రాజ్‌కంటే స్మృతి మంధన ఫామ్ భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. తొలి రెండు మ్యాచ్‌లలో 90, 106 పరుగులు చేసిన ఆమె, ఆ తర్వాత వరుసగా 2, 8, 4, 3, 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీస్‌లో ఆమె చెలరేగడం అవసరం.
ఆసీస్‌పైనే సెంచరీ చేసిన పూనమ్ రౌత్ మరో భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టింది. హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మల సహకారం కూడా జట్టు ముందంజ వేయడంలో ఉపయోగపడింది. వీరంతా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో మరోసారి స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ కీలకం కానుంది. న్యూజిలాండ్‌పై ఆమె ఒంటిచేత్తో విజయం అందించింది. 2016 ఫిబ్రవరిలో భారత్ ఆఖరిసారి ఆసీస్‌ను ఓడించినప్పుడు రాజేశ్వరి 2 కీలక వికెట్లు పడగొట్టింది. ప్రధాన పేసర్లు జులన్, శిఖా పాండే మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.
లానింగ్ ఫిట్...
జట్టులో 9వ స్థానం వరకు కూడా బ్యాటింగ్ చేయగల ప్లేయర్లు ఉండటం ఆస్ట్రేలియా ప్రధాన బలం. టోర్నీలో సంయుక్తంగా ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు సాధించిన ఓపెనర్లు బెథ్ మూనీ, నికోల్ బోల్టన్ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఎలీస్ పెర్రీ అద్భుత ప్రదర్శన ఆసీస్‌ను దూసుకుపోయేలా చేస్తోంది. టోర్నీలో 366 పరుగులు చేయడంతో పాటు ఆమె 9 వికెట్లు కూడా పడగొట్టింది. భుజం గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ లానింగ్ కోలుకొని తిరిగి వస్తుండటం ఆసీస్ బలాన్ని పెంచింది. ఆసీస్ స్పిన్నర్లు జొనాసెన్, ఆష్లీ, బీమ్స్ కలిసి మొత్తం 27 వికెట్లు పడగొట్టడం విశేషం. అన్ని రంగాల్లో మెరుగ్గా కనిపిస్తున్న ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్ తమ స్థాయికి మించిన ప్రదర్శనను కనబర్చాల్సి ఉంటుంది.
ఈ మైదానం మాకు సొంత మైదానంలాంటిది కావడం సానుకూలాంశం. ఆస్ట్రేలియా చాలా పటిష్టమైన జట్టు. వారిని ఓడిస్తే ఒక అద్భుతమే అవుతుంది. మాకు సంబంధించి ఇది చాలా పెద్ద మ్యాచ్. అయితే గతంలో ఈ తరహా ఒత్తిడితో కూడిన అనేక మ్యాచ్‌లు ఆడిన అనుభవం మా జట్టులో చాలా మందికి ఉంది. పరిస్థితులను బట్టి ఆడటం ముఖ్యం. గెలవాలంటే మా జట్టు సహచరులందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.
–మిథాలీ రాజ్, భారత కెప్టెన్
ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ మొదలు టోర్నీ ఆసాంతం ఆ జట్టు ఆటలో దూకుడు ఎక్కువగా కనిపించింది. అయితే మా సామర్థ్యానికి తగినట్లుగా, ప్రణాళికకు అనుగుణంగా ఆడటం ముఖ్యం. మ్యాచ్ వేదిక ఏమిటనేది పట్టించుకోవడం అనవసరం. ఇక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు రూపొందించుకుంటాం. వరల్డ్ కప్‌లో భారత జట్టు ఆట మమ్మల్ని ఆకట్టుకుంది.
– అలెక్స్ బ్లాక్‌వెల్, ఆసీస్ వైస్ కెప్టెన్
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, శిఖా పాండే, సుష్మ వర్మ, జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.
ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), మూనీ, బోల్టన్, ఎలీస్ పెర్రీ, విలాని, బ్లాక్‌వెల్, హీలీ, ఆష్లీ గార్డ్‌నర్, జొనాసెన్, మెగాన్ షుట్, క్రిస్టన్ బీమ్స్
పిచ్, వాతావరణం
సాధారణ బ్యాటింగ్ వికెట్. అయితే స్పిన్ బౌలింగ్‌కు బాగా అనుకూలించే వేదిక. ఇక్కడ భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలవగా, ఆసీస్ మొదటిసారి ఇక్కడ బరిలోకి దిగుతోంది. ఈ గ్రౌండ్‌లో భారత్ స్పిన్నర్లు 24 వికెట్లు పడగొట్టారు. ముందుగా బ్యాటింగ్ చేసి 275 పరుగుల వరకు స్కోరు సాధిస్తే విజయావకాశాలు ఉంటాయి. వర్షం వల్ల మ్యాచ్‌కు ముప్పు లేదు.
► మధ్యాహ్నం గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం