
వెల్లింగ్టన్: ఓపెనర్ టామ్ లాథమ్ (489 బంతుల్లో 264 నాటౌట్; 21 ఫోర్లు, 1 సిక్స్) అజేయ ద్విశతకంతో చెలరేగడంతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 311/2తో మూడో రోజు సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్‌ను లాథమ్ ముందుకు నడిపించాడు. రాస్ టేలర్ (50; 5 ఫోర్లు) వెంటనే ఔటైనా... నికోల్స్ (50; 6 ఫోర్లు), గ్రాండ్‌హోమ్ (53 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) సహకారంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
దీంతో ఆతిథ్య జట్టు 578 పరుగులకు ఆలౌటైంది. 296 పరుగుల భారీ లోటుతో అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకను టిమ్ సౌతీ (2/7), బౌల్ట్ (1/12) దెబ్బకొట్టారు. వారి ధాటికి ఆ జట్టు 20 పరుగులకే ఓపెనర్లు గుణతిలక (3), కరుణరత్నే (10), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ధనంజయ డిసిల్వా (0) వికెట్లు కోల్పోయింది. కుశాల్ మెండిస్ (5 బ్యాటింగ్), మాథ్యూస్ (2 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో లంక పరాజయాన్ని తప్పించుకోవడం కష్టమే. ఓపెనర్‌గా వచ్చి అత్యధిక స్కోరుతో నాటౌట్‌గా నిలిచిన బ్యాట్స్‌మన్‌గా టామ్ లాథమ్ రికార్డు నెలకొల్పాడు. అలిస్టర్ కుక్ (244 నాటౌట్; ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో 2017) పేరిట ఉన్న ఈ రికార్డును లాథమ్ సవరించాడు.
Comments
Please login to add a commentAdd a comment