లండన్: ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ సీడెడ్ క్రీడాకారిణులకు ఏమాత్రం కలిసి రావడంలేదు. తాజాగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) కూడా ఇంటిదారి పట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో ప్రపంచ 48వ ర్యాంకర్ సె సు–వె (చైనీస్ తైపీ) 3–6, 6–4, 7–5తో హలెప్‌పై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన హలెప్ ఈ మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా ఓడిపోయింది. నిర్ణాయక మూడో సెట్‌లో ఒకదశలో 5–2తో ఆధిక్యంలో నిలిచి... మ్యాచ్ పాయింట్ కూడా సంపాదించిన ఆమె ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. అనంతరం వరుసగా ఐదు గేమ్‌లు కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. హలెప్ ఓటమితో మహిళల సింగిల్స్ ‘డ్రా’లో టాప్–10లో ఒక్కఏడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మాత్రమే మిగిలి ఉంది. టాప్–32 సీడింగ్స్‌లో ఏడుగురు మాత్రమే బరిలో ఉండటం గమనార్హం. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6–2, 6–4తో 18వ సీడ్ ఒసాకా (జపాన్)పై, 12వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) 6–0, 6–4తో దియత్‌చెంకో (రష్యా) పై, 14వ సీడ్ కసత్‌కినా (రష్యా) 7–5, 6–3తో 17వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై గెలిచారు.
నాదల్ ముందుకు... జ్వెరెవ్ ఔట్
పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో రెండో సీడ్ నాదల్ (స్పెయిన్) 6–1, 6–2, 6–4తో డెమినౌర్ (ఆస్ట్రేలియా)పై, ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–4, 7–6 (7/4), 6–3తో పెయిర్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–7 (2/7), 6–4, 7–5, 3–6, 0–6తో గుల్బిస్ (లాత్వియా) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్ రెండో రౌండ్‌లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–7 (2/7), 7–6 (7/3), 6–7 (3/7), 3–6తో మెక్‌లాచ్లెన్ (జపాన్) –స్ట్రఫ్ (జర్మనీ) జంట చేతిలో ఓడింది. దివిజ్ శరణ్ (భారత్)–సితాక్ (న్యూజిలాండ్) జోడీ 6–7 (5/7), 4–6, 6–3, 7–6 (7/5), 6–4తో పెరాల్టా (చిలీ)–జెబలాస్ (అర్జెంటీనా) ద్వయంపై గెలిచింది.
అయ్యో... హలెప్
Published Sun, Jul 8 2018 1:39 AM | Last Updated on Sun, Jul 8 2018 1:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment