Halep
-
మూడో రౌండ్లో జొకోవిచ్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–2, 6–3, 6–2తో టలాన్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో 12వ సీడ్ హలెప్ (రొమేనియా) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో రౌండ్లో హలెప్ 7–6 (13/11), 4–6, 6–3తో రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా (భారత్)–కోకో వాండవే (అమెరికా) జంట 6–4, 4–6, 3–6తో రలుకా (రొమేనియా)–కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ చేతిలో ఓడింది. -
అయ్యో... హలెప్
లండన్: ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ సీడెడ్ క్రీడాకారిణులకు ఏమాత్రం కలిసి రావడంలేదు. తాజాగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) కూడా ఇంటిదారి పట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రపంచ 48వ ర్యాంకర్ సె సు–వె (చైనీస్ తైపీ) 3–6, 6–4, 7–5తో హలెప్‌పై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన హలెప్ ఈ మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా ఓడిపోయింది. నిర్ణాయక మూడో సెట్లో ఒకదశలో 5–2తో ఆధిక్యంలో నిలిచి... మ్యాచ్ పాయింట్ కూడా సంపాదించిన ఆమె ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. అనంతరం వరుసగా ఐదు గేమ్‌లు కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. హలెప్ ఓటమితో మహిళల సింగిల్స్ ‘డ్రా’లో టాప్–10లో ఒక్కఏడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మాత్రమే మిగిలి ఉంది. టాప్–32 సీడింగ్స్‌లో ఏడుగురు మాత్రమే బరిలో ఉండటం గమనార్హం. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6–2, 6–4తో 18వ సీడ్ ఒసాకా (జపాన్)పై, 12వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) 6–0, 6–4తో దియత్‌చెంకో (రష్యా) పై, 14వ సీడ్ కసత్కినా (రష్యా) 7–5, 6–3తో 17వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. నాదల్ ముందుకు... జ్వెరెవ్ ఔట్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ నాదల్ (స్పెయిన్) 6–1, 6–2, 6–4తో డెమినౌర్ (ఆస్ట్రేలియా)పై, ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–4, 7–6 (7/4), 6–3తో పెయిర్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–7 (2/7), 6–4, 7–5, 3–6, 0–6తో గుల్బిస్ (లాత్వియా) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్ రెండో రౌండ్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–7 (2/7), 7–6 (7/3), 6–7 (3/7), 3–6తో మెక్లాచ్లెన్ (జపాన్) –స్ట్రఫ్ (జర్మనీ) జంట చేతిలో ఓడింది. దివిజ్ శరణ్ (భారత్)–సితాక్ (న్యూజిలాండ్) జోడీ 6–7 (5/7), 4–6, 6–3, 7–6 (7/5), 6–4తో పెరాల్టా (చిలీ)–జెబలాస్ (అర్జెంటీనా) ద్వయంపై గెలిచింది. -
టైటిల్ పోరుకు హలెప్, వొజ్నియాకి
మెల్బోర్న్: ప్రపంచ నంబర్‌వన్ సిమోనా హలెప్, రెండో సీడ్ వోజ్నియాకి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఈ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో వీరిద్దరిలో ఎవరు గెలిచినా కొత్త చాంపియన్‌గా అవతరిస్తారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ హలెప్ (రొమేనియా) 6–3, 4–6, 9–7తో మాజీ చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)పై చెమటోడ్చి నెగ్గింది. మరో సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–3, 7–6 (7/2)తో ఎలీస్ మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించింది. పోరాడి ఓడిన కెర్బర్: ప్రపంచ 21వ ర్యాంకర్, 2016 చాంపియన్ కెర్బర్ తొలిసెట్లో తేలిగ్గానే తలొగ్గినా... తర్వాతి సెట్లలో కడదాకా పోరాడింది. ఒక దశలో టాప్ సీడ్ హలెప్ 6–3, 3–1 స్కోరుతో ఆధిక్యంలో ఉండటంతో వరుస సెట్లలోనే కెర్బర్‌కు ఓటమి ఖాయమనిపించింది. అయితే జర్మనీకి చెందిన ఈ మాజీ చాంపియన్ తన శక్తినంత కూడదీసుకొని రెండో సెట్‌ను చేజిక్కించుకుంది. ఇక నిర్ణాయక మూడో సెట్లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. దీంతో మరో మారథాన్ మ్యాచ్‌లా తలపించినా చివరకు నంబర్‌వన్ హలెప్ పవర్షాట్లతో సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరో సెమీఫైనల్లో వోజ్నియాకికి రెండో సెట్లో అన్‌సీడెడ్ మెర్టన్స్ గట్టి పోటీనిచ్చింది. దీంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. ఇందులో రెండో సీడ్ వోజ్నియాకి తన అనుభవంతో ప్రత్యర్థిని సులభంగానే చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్‌లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా) తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. సెమీఫైనల్లో ఆరో సీడ్ సిలిచ్ 6–2, 7–6 (7/4), 6–2తో కైల్ ఎడ్మండ్ (బ్రిటన్)ను ఓడించాడు. -
హమ్మయ్య... హలెప్
అసలే మెల్బోర్న్లో శరీరాన్ని ఉడికించే ఉష్ణోగ్రత. ఇలాంటి సమయంలో ఏకాగ్రతతో ఆడటమే కష్టం. మహిళల సింగిల్స్ అయితే మరింత కష్టం. కానీ ప్రపంచ నంబర్‌వన్ హలెప్ మాత్రం ఈ కష్టానికి ఎదురుతిరిగింది. చెమటలు కక్కించిన పోరులో మారథాన్ ఆట ఆడింది. దాదాపు ఓటమి ఖాయమైన స్థితి నుంచి గట్టెక్కి.... ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాళ్లు ఫెడరర్, జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మెల్బోర్న్: మహిళల నంబర్‌వన్ సిమోనా హలెప్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో చావుతప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి తలెత్తింది. మూడో రౌండ్లో సుమారు నాలుగు గంటల పాటు జరిగిన పోరులో రొమేనియా టాప్‌స్టార్ అతికష్టమ్మీద గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. హమ్మయ్య అనుకుంటూ హలెప్ మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఆమెతో పాటు ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్), కెర్బర్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్, సెర్బియా ఆటగాడు జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మహిళల మారథాన్ పోరు... మూడు గంటల 44 నిమిషాల పాటు టెన్నిస్ కోర్టులో మహిళలు తలపడటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ... టాప్‌సీడ్ హలెప్, 50వ ర్యాంకర్ లారెన్ డేవిస్ (అమెరికా) మూడో రౌండ్లో ఆరంభం నుంచి కడదాకా హోరాహోరీగా తలపడ్డారు. చివరకు రొమేనియా నంబర్‌వన్ 4–6, 6–4, 15–13తో లారెన్‌పై గెలిచింది. నిర్ణాయక మూడో సెట్ జరుగుతున్నకొద్దీ పోటీ పెరుగుతూ పోయింది. 24 ఏళ్ల లారెన్... టాప్స్టార్కు దీటుగా బదులివ్వడంతో హలెప్ కథ కంచికి చేరే ప్రమాదం ఎదురైంది. చివరి గేమ్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడంతో ఎట్టకేలకు గెలుపుతో గట్టెక్కింది. ఫలితంలో ఓడినా... అమెరికా అమ్మాయి తన పోరాటపటిమలో గెలిచిందనే చెప్పాలి. మిగతా మహిళల సింగిల్స్ పోటీల్లో మరియా షరపోవా (రష్యా) 1–6, 3–6తో 21వ సీడ్ కెర్బర్ (జర్మనీ) చేతిలో చిత్తుగా ఓడింది. ప్లిస్కోవా (చెక్‌రిపబ్లిక్) 7–6 (8/6), 7–5తో తన దేశానికే చెందిన సఫరోవాపై నెగ్గింది. 20వ సీడ్ స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో బెర్నార్డ పెర (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్) 6–3, 5–7, 6–2తో సస్నోవిచ్ (బెలారస్)పై, సు వే సియే (చైనీస్ తైపీ) 6–2, 7–5తో 26వ సీడ్ రద్వాన్‌స్కా (పోలండ్)పై గెలుపొందారు. ఫెడరర్, జొకోవిచ్ అలవోకగా పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో స్విట్జర్లాండ్ దిగ్గజం, రెండో సీడ్ రోజర్ ఫెడరర్ 6–2, 7–5, 6–4తో రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్)పై, 14వ సీడ్ జొకోవిచ్ 6–2, 6–3, 6–3తో రమొస్ వినోలస్ (స్పెయిన్)పై అలవోక విజయం సాధించారు. నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)కు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. అన్‌సీడెడ్ హియోన్ చంగ్ (దక్షిణ కొరియా) 5–7, 7–6 (7/3), 2–6, 6–3, 6–0తో జ్వెరెవ్‌ను కంగుతినిపించాడు. ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–2, 7–5తో అడ్రియన్ మనరినో (ఫ్రాన్స్)పై, 19వ సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3, 6–2తో డెల్ పొట్రో (అర్జెంటీనా)పై గెలుపొందారు. ప్రిక్వార్టర్స్‌లో పేస్ జోడీ పురుషుల డబుల్స్‌లో వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్... పురవ్ రాజాతో కలిసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన రెండో రౌండ్లో అన్‌సీడెడ్ భారత ద్వయం 7–6 (7/3), 5–7, 7–6 (8/6)తో ఐదో సీడ్ బ్రునో సోరెస్ (బ్రెజిల్)– జేమీ ముర్రే (బ్రిటన్) జంటపై చెమటోడ్చి నెగ్గింది. గత ఏడాది విజయవంతమైన ఈ జోడీకి ఈ సీజన్ ఆరంభ టోర్నీలో భారత జంట చెక్‌పెట్టింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ పోరులో రాజా అద్భుతంగా ఆడాడు. కీలకమైన టై బ్రేకర్‌లో మ్యాచ్ పాయింట్‌ను కాచుకున్న భారత జోడీకి రాజా బ్యాక్‌హ్యాండ్ రిటర్న్ షాట్‌తో విజయాన్నిచ్చాడు. ప్రిక్వార్టర్స్‌లో పేస్–రాజా ద్వయం... 11వ సీడ్ సెబాస్టియన్ కెబల్ (కొలంబియా)–రాబర్ట్ ఫరా (కెనడా) జంటతో తలపడుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో 48 గేమ్‌ల ప్రపంచ రికార్డు ఈ మ్యాచ్‌తో సమమైంది. 1996లో ఇదే తరహాలో 48 గేమ్‌ల పాటు సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చందా రూబిన్ 6–4, 2–6, 16–14తో అరంటా సాంచెజ్ను ఓడించింది. -
'గ్రాండ్' ఎంట్రీ
ఫ్రెంచ్ ఓపెన్ విజేత జెలెనా ఒస్టాపెంకో ♦ అన్‌సీడెడ్ హోదాలో అద్భుతం ♦ ఆడిన తొలి ‘గ్రాండ్’ ఫైనల్లోనే ట్రోఫీ కైవసం ♦ ఫైనల్లో మూడో సీడ్ హలెప్‌పై విజయం ♦ రూ. 15 కోట్ల 10 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ముఖంపై ఇంకా వీడని అమాయకత్వపు ఛాయలు... కానీ కోర్టులో దిగితే మాత్రం తన రాకెట్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టేలా ఆటతీరు... ఎలాంటి అంచనాలు లేకుండా అనామకురాలిగా అడుగు పెట్టినా... తనకంటే ఎంతో మెరుగైన వారు ప్రత్యర్థులుగా ఎదురైనా... పూర్తి విశ్వాసంతో ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ... చివరకు ఎవ్వరూ ఊహించనిరీతిలో ‘గ్రాండ్’గా ఫినిష్ చేసింది. గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల చరిత్రలోనే సంచలనాత్మక విజయం సాధించి అందర్నీ ఔరా అనిపించేలా చేసింది. ఆమే లాత్వియాకు చెందిన 20 ఏళ్ల జెలెనా ఒస్టాపెంకో. ఫ్రెంచ్ ఓపెన్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఒస్టాపెంకో ఏకంగా టైటిల్‌నే సొంతం చేసుకొని టెన్నిస్ క్రీడాలోకాన్ని నివ్వెరపరిచింది. టైటిల్ సాధించిన క్రమంలో ఒస్టాపెంకో రెండో రౌండ్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ మోనికా పుయిగ్ (ప్యూర్టోరికో)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 2011 యూఎస్ ఓపెన్ చాంపియన్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై, క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై, సెమీఫైనల్లో 30వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. పారిస్: అనుభవంపై యువతరంగం గెలిచింది. సత్తా ఉండాలేగానీ సీడింగ్స్తో, ర్యాంక్‌లతో సంబంధం లేదని జెలెనా ఒస్టాపెంకో నిరూపించింది. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 20 ఏళ్ల ఈ లాత్వియా అమ్మాయి మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. రొలాండ్ గారోస్‌లో శనివారం గంటా 59 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ ఒస్టాపెంకో 4–6, 6–4, 6–3తో మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచింది. విజేతగా నిలిచిన ఒస్టాపెంకోకు 21 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 10 లక్షలు)... రన్నరప్ హలెప్‌నకు 10 లక్షల యూరోలు (రూ. 7 కోట్ల 19 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీకి ముందు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 47వ స్థానంలో ఉన్న ఒస్టాపెంకో తాజా ప్రదర్శనతో సోమవారం విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో 12వ స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ హలెప్ గెలిచిఉంటే కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడంతోపాటు ఆమెకు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ ఖాయమయ్యేది. ఈ టోర్నీకి ముందు కెరీర్లో ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన ఒస్టాపెంకో ఏనాడూ రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. అంతేకాకుండా ఫ్రొఫెషనల్ కెరీర్లో కేవలం మూడు టోర్నీలలో ఫైనల్‌కు చేరుకొని మూడింటిలోనూ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. గ్రాండ్‌స్లామ్ రూపంలోనే ఒస్టాపెంకో తన కెరీర్లో తొలి టైటిల్‌ను సాధించడం విశేషం. వెనుకబడినా... ఒస్టాపెంకోతో పోలిస్తే కెరీర్లో 28వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న హలెప్‌ను అందరూ టైటిల్ ఫేవరెట్‌గా భావించారు. 2014లో ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలువడం కూడా హలెప్‌పై అంచనాలు పెంచాయి. తొలి సెట్‌ను హలెప్ గెలుపొందడం... రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలో ఉండటంతో హలెప్‌కు టైటిల్ లభించడం లాంఛనమే అనిపించింది. కానీ ఒస్టాపెంకో మాత్రం అలా భావించలేదు. పోరాడితే పోయేదేముందీ అనుకుంటూ జూలు విదిల్చింది. ఒకవైపు అనవసర తప్పిదాలు చేస్తున్నా... వాటికి ఏమాత్రం తగ్గకుండా విన్నర్స్ కూడా కొడుతుండటంతో ఒస్టాపెంకో విజయావకాశాలకు ఊపిరి వచ్చింది. తొలి సెట్లో ఓడి, రెండో సెట్లో 0–3తో వెనుకబడిన దశలో ఒస్టాపెంకో విజృంభించింది. హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు తన సర్వీస్‌లను కాపాడుకొని స్కోరును 3–3తో సమం చేసింది. పదో గేమ్‌లో హలెప్ సర్వీస్‌ను మరోసారి ఒస్టాపెంకో బ్రేక్ చేసి రెండో సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో ఒస్టాపెంకో 1–3తో వెనుకబడింది. కానీ మళ్లీ పోరాడిన ఒస్టాపెంకో వరుసగా ఐదు గేమ్‌లను గెలిచి హలెప్ ఆశలను ఆవిరిచేసింది. తన కెరీర్లోనే చిరస్మరణీయ ఘట్టాన్ని ఆవిష్కరించుకుంది. నా కల నెరవేరింది. ఈ విజయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. దానికి మరికొంత సమయం పడుతుందేమో. బంతిని బలంగా బాదగల నైపుణ్యం నాకు మొదటి నుంచి ఉంది. టోర్నీలో నా షాట్లన్నీ బాగా పనిచేశాయి. మ్యాచ్‌కు పది నిమిషాల ముందు మినహా ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. ఫైనల్‌కు ముందు రాత్రి కూడా ప్రశాంతంగా పడుకున్నాను. రెండో సెట్లో వెనుకబడిన దశలో ఇక పోయేదేమీ లేదు, ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాను. ఫైనల్ చేరిన సంతృప్తి ఉంది కాబట్టి చివరి వరకు పోరాడాలని మాత్రం భావించాను. దూకుడుగా ఆడటంతో మ్యాచ్ నా వైపు తిరిగింది. కుయెర్టన్ గెలిచిన రోజే నేను పుట్టడం అదృష్టం కావచ్చేమో. నాకు గ్రాస్‌కోర్టు అంటే ఇష్టం. ఇక వింబుల్డన్ సాధించడంపైనే దృష్టి. –ఒస్టాపెంకో ఆమె బంతిని చాలా బలంగా కొట్టసాగింది. ఒక దశలో నేను ప్రేక్షకురాలిగా మారిపోయాను. గెలిచేందుకు ఒస్టాపెంకో అన్ని విధాలా అర్హురాలు. నాకు సంబంధించి ఇది వేదనాభరిత క్షణం. అయితే కాలం సాగిన కొద్దీ ఆ బాధ తగ్గుతుందని ఆశిస్తున్నా. భవిష్యత్‌లో నాకు ఏం రాసిపెట్టి ఉందో చూద్దాం. –హలెప్ ఒస్టాపెంకో విజయం విశేషాలు ⇔ 1933లో మార్గరెట్ స్క్రివెన్ వివియన్ (బ్రిటన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు. ⇔ 2001లో జెన్నిఫర్ కాప్రియాటి (అమెరికా) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తొలి సెట్లో ఓడిపోయాక కూడా టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా ఘనత. ⇔ 1997లో ఇవా మయోలీ (క్రొయేషియా–19 ఏళ్ల 300 రోజులు) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్... 2006లో మరియా షరపోవా (యూఎస్ ఓపెన్–19 ఏళ్ల 77 రోజులు) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో పిన్న వయస్కురాలిగా గుర్తింపు. ⇔ కెరీర్లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీని గెలుచుకున్న మూడో ప్లేయర్. మహిళల విభాగంలో బార్బరా జోర్డాన్ (1979 ఆస్ట్రేలియన్ ఓపెన్) ముందుగా ఈ రికార్డు నెలకొల్పగా... 1997 జూన్ 8న గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్) కూడా దానిని సాధించాడు. అదే రోజు పుట్టిన ఒస్టాపెంకో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకోవడం విశేషం. ⇔ కేవలం 20 లక్షల జనాభా ఉన్న యూరోపియన్ దేశం లాత్వియా నుంచి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు. నాదల్ @ వావ్రింకా నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ సా. గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
జికా భయం... రియోకు రాలేం
ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న రానిచ్, హాలెప్ పారిస్: జికా వైరస్ కారణంగా రియో నుంచి అథ్లెట్లు తప్పుకోవడం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా వింబుల్డన్ రన్నరప్ రానిచ్, 2014 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హాలెప్... ఇద్దరూ రియో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జికా వైరస్ కారణంగానే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇరువురూ ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా కూడా పలువురు ఆటగాళ్లు రియోకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రియోలో భద్రతను రెట్టింపు చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. క్రీడా గ్రామంలో 85వేల మంది పోలీసులతోపాటు కట్టుదిట్టమైన ట్రాఫిక్ నిబంధనలు, అదనంగా చెక్‌పాయింట్స్, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రెజిల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. -
క్వార్టర్స్ లో ఇంటిదారి పట్టిన హలెప్
మెల్ బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ లో ప్రపంచ మూడో ర్యాంక్ క్రీడాకారిణ సిమోనా హలెప్ (రుమేనియా) క్వార్టర్స్ లోనే ఇంటి దారి పట్టింది. మంగళవారం జరిగిన పోరులో మకారోవా చేతిలో 6-4, 6-0 తేడాతో హలెప్ ఓటమి పాలైంది. తొలి సెట్ లో గట్టిపోటి ఇచ్చినా.. సెట్ ను కాపాడు కోలేకపోయింది. పూర్తిగా డీలా పడిన హలెప్ రెండో సెట్ లో మాత్రం పూర్తిగా వెనుకబడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గత మ్యాచ్ ల్లో దుమ్ములేపిన హలెప్ ఈ మ్యాచ్ లో మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దీంతో మకారోవా సెమీఫైనల్ కు ప్రవేశించింది.