అసలే మెల్‌బోర్న్‌లో శరీరాన్ని ఉడికించే ఉష్ణోగ్రత. ఇలాంటి సమయంలో ఏకాగ్రతతో ఆడటమే కష్టం. మహిళల సింగిల్స్ అయితే మరింత కష్టం. కానీ ప్రపంచ నంబర్‌వన్ హలెప్ మాత్రం ఈ కష్టానికి ఎదురుతిరిగింది. చెమటలు కక్కించిన పోరులో మారథాన్ ఆట ఆడింది. దాదాపు ఓటమి ఖాయమైన స్థితి నుంచి గట్టెక్కి.... ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాళ్లు ఫెడరర్, జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
మెల్‌బోర్న్: మహిళల నంబర్‌వన్ సిమోనా హలెప్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో చావుతప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి తలెత్తింది. మూడో రౌండ్లో సుమారు నాలుగు గంటల పాటు జరిగిన పోరులో రొమేనియా టాప్‌స్టార్ అతికష్టమ్మీద గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. హమ్మయ్య అనుకుంటూ హలెప్ మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఆమెతో పాటు ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్), కెర్బర్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్, సెర్బియా ఆటగాడు జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.
మహిళల మారథాన్ పోరు...
మూడు గంటల 44 నిమిషాల పాటు టెన్నిస్ కోర్టులో మహిళలు తలపడటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ... టాప్‌సీడ్ హలెప్, 50వ ర్యాంకర్ లారెన్ డేవిస్ (అమెరికా) మూడో రౌండ్‌లో ఆరంభం నుంచి కడదాకా హోరాహోరీగా తలపడ్డారు. చివరకు రొమేనియా నంబర్‌వన్ 4–6, 6–4, 15–13తో లారెన్‌పై గెలిచింది. నిర్ణాయక మూడో సెట్ జరుగుతున్నకొద్దీ పోటీ పెరుగుతూ పోయింది. 24 ఏళ్ల లారెన్... టాప్‌స్టార్‌కు దీటుగా బదులివ్వడంతో హలెప్ కథ కంచికి చేరే ప్రమాదం ఎదురైంది. చివరి గేమ్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడంతో ఎట్టకేలకు గెలుపుతో గట్టెక్కింది. ఫలితంలో ఓడినా... అమెరికా అమ్మాయి తన పోరాటపటిమలో గెలిచిందనే చెప్పాలి. మిగతా మహిళల సింగిల్స్ పోటీల్లో మరియా షరపోవా (రష్యా) 1–6, 3–6తో 21వ సీడ్ కెర్బర్ (జర్మనీ) చేతిలో చిత్తుగా ఓడింది. ప్లిస్కోవా (చెక్‌రిపబ్లిక్) 7–6 (8/6), 7–5తో తన దేశానికే చెందిన సఫరోవాపై నెగ్గింది. 20వ సీడ్ స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో బెర్నార్డ పెర (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్) 6–3, 5–7, 6–2తో సస్నోవిచ్ (బెలారస్)పై, సు వే సియే (చైనీస్ తైపీ) 6–2, 7–5తో 26వ సీడ్ రద్వాన్‌స్కా (పోలండ్)పై గెలుపొందారు.
ఫెడరర్, జొకోవిచ్ అలవోకగా
పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో స్విట్జర్లాండ్ దిగ్గజం, రెండో సీడ్ రోజర్ ఫెడరర్ 6–2, 7–5, 6–4తో రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్)పై, 14వ సీడ్ జొకోవిచ్ 6–2, 6–3, 6–3తో రమొస్ వినోలస్ (స్పెయిన్)పై అలవోక విజయం సాధించారు. నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)కు మూడో రౌండ్‌లోనే చుక్కెదురైంది. అన్‌సీడెడ్ హియోన్ చంగ్ (దక్షిణ కొరియా) 5–7, 7–6 (7/3), 2–6, 6–3, 6–0తో జ్వెరెవ్‌ను కంగుతినిపించాడు. ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–2, 7–5తో అడ్రియన్ మనరినో (ఫ్రాన్స్)పై, 19వ సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3, 6–2తో డెల్ పొట్రో (అర్జెంటీనా)పై గెలుపొందారు.
ప్రిక్వార్టర్స్‌లో పేస్ జోడీ
పురుషుల డబుల్స్‌లో వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్... పురవ్ రాజాతో కలిసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన రెండో రౌండ్‌లో అన్‌సీడెడ్ భారత ద్వయం 7–6 (7/3), 5–7, 7–6 (8/6)తో ఐదో సీడ్ బ్రునో సోరెస్ (బ్రెజిల్)– జేమీ ముర్రే (బ్రిటన్) జంటపై చెమటోడ్చి నెగ్గింది. గత ఏడాది విజయవంతమైన ఈ జోడీకి ఈ సీజన్ ఆరంభ టోర్నీలో భారత జంట చెక్‌పెట్టింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ పోరులో రాజా అద్భుతంగా ఆడాడు. కీలకమైన టై బ్రేకర్‌లో మ్యాచ్ పాయింట్‌ను కాచుకున్న భారత జోడీకి రాజా బ్యాక్‌హ్యాండ్ రిటర్న్ షాట్‌తో విజయాన్నిచ్చాడు. ప్రిక్వార్టర్స్‌లో పేస్–రాజా ద్వయం... 11వ సీడ్ సెబాస్టియన్ కెబల్ (కొలంబియా)–రాబర్ట్ ఫరా (కెనడా) జంటతో తలపడుతుంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో 48 గేమ్‌ల ప్రపంచ రికార్డు ఈ మ్యాచ్‌తో సమమైంది. 1996లో ఇదే తరహాలో 48 గేమ్‌ల పాటు సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చందా రూబిన్ 6–4, 2–6, 16–14తో అరంటా సాంచెజ్‌ను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment