ఆసీస్ మళ్లీ 'కంగారు' పడుతోంది..!
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో శ్రీలంక చేతిలో ఓటమిపాలైన ఆస్ట్రేలియా కాస్త కంగారు పడుతుంది. రేపు (గురువారం) గాలేలో ప్రారంభంకానున్న రెండో టెస్టులోనే పాతకథ రిపీట్ అవుతుందేమేనని ఆసీస్ ఆందోళనలో ఉంది. ఎందుకంటే 17 ఏళ్ల తర్వాత తమ జట్టును లంక ఓడించడం.. అందులోనూ సంగక్కర, జయవర్ధనే, ముత్తయ్య మురళీదరన్, సనత్ జయసూర్య లాంటి దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత ఇది సంభవించడం ఆసీస్ ఓ పట్టాన జీర్ణించుకోలేక పోతుంది.
అందులోనూ టెస్టు ర్యాంకింగ్స్ లో తమ అగ్రస్థానానికి ముప్పు వాటిల్లి మూడో స్థానానికి పడిపోతామని ఆసీస్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. టెస్టు ర్యాంకింగ్స్ లో ఆసీస్ 118, భారత్ 112, పాకిస్తాన్ 111 పాయింట్లతో వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. యువ సంచలనాలు కుశాల్ మెండిస్ అద్భుత బ్యాటింగ్, స్పిన్నర్ సందకన్ (7/107) తో చెలరేగడం చారిత్రక విజయానికి నాంది పలికింది. గాలేలో లంక 11 టెస్టులాడగా 7 మ్యాచ్ ల్లో నెగ్గి కేవలం నాలుగు మ్యాచులలో ఓడింది.
గాలే ముఖ్యంగా స్పిన్నర్ల స్వర్గధామం కావడంతో గత టెస్టులో అదరగొట్టిన హెరాత్(9వికెట్లు)కు తోడు సందకన్ చెలరేగితే ఆసీస్ కష్టాలు తప్పవని కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడుతున్నాడు. 61.79 శాతం స్పిన్నర్లకు ఈ పిచ్ అనుకూలం. లంకకు కూడా గాలేలో మంచి రికార్డు ఉంది. తొలి టెస్టులో గాయపడ్డ స్టీవ్ ఓ కెఫె స్థానంలో మరో స్పిన్నర్ జాన్ హోలాండ్ను ఆసీస్ జట్టులోకి ఆహ్వానించింది. మరోవైపు లంక పేసర్ నువాన్ ప్రదీప్ ఫిట్ నెస్ లేని కారణంగా రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు.