పుణేను ఓడించడం కష్టమే: విలియమ్సన్
హైదరాబాద్: శనివారం ఉప్పల్ లో జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణే ఐపీఎల్ మ్యాచ్ లో పుణేను ఓడించడం కష్టమేనని సన్ రైజర్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న రైజింగ్ పుణే తో జరిగే మ్యాచ్ టఫ్ గేమ్ అని, అయినా సమిష్టిగా రాణిస్తామని విలియమ్సన్ మీడియా కు తెలిపాడు. ప్రతి ఒక మ్యాచ్ చాలేంజ్ అని, ఇప్పటి వరకు మంచి క్రికెట్ ఆడామని, పుణే తో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఎప్పుడూ విజయాలు సొంతం కావని, ముఖ్యంగా టీ20 లో ఇది సాధ్యం కాదని తెలిపాడు. దీన్ని దృష్టి లో ఉంచుకోని ముందుకు వెళ్తామని విలియమ్సన్ పేర్కొన్నాడు. జట్టులో మూడో నెంబర్ బ్యాట్స్ మన్ గా జట్టుకు ఏమి కావాలో అది చేస్తానన్నాడు. జట్టుకు అవసరమైతే ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్దం అన్నాడు. డెవిడ్ వార్నర్ మంచి నాయకుడని, అతని నాయకత్వంలో ఆడటం సంతోషంగా ఉందని విలియమ్సన్ తెలిపాడు.
ఢిఫెండింగ్ ఛాంపియన్స్ అయినందుకు మాజట్టు పై కొంత ఒత్తిడి ఉందని, గత సీజన్ లో కంటే ఈ సీజన్ లో మా ఆట తీరు చాలా మెరుగైందని చెప్పాడు. గత మ్యాచ్ ఢిల్లీ తో భారీ స్కోరు చేసినా ఓడిపోయామని, ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నామని, మంచి క్రికెట్ ఆడుతూ ఇంకా రెండు మ్యాచ్ లు నెగ్గి ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తామని విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఈ ఐపీఎల్ అనుభవం వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ న్యూజిలాండ్ కెప్టెన్ పేర్కొన్నాడు.