న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత పొందిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన మహిళల 51 కేజీల ట్రయల్ ఫైనల్ బౌట్‌లో ఆమె 9–1 పాయింట్ల తేడాతో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌ను ఓడించింది. దీంతో ఈ కేటగిరీలో ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో మేరీ పోటీపడనుంది. కాగా, బౌట్ ముగిసిన తర్వాత మేరీకోమ్ ప్రవర్తించిన తీరు ఆశ్చర్య పరిచింది. కనీసం నిఖత్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. తనకు నిఖత్ తీరు నచ్చకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదని మేరీకోమ్ తెలిపింది.
నిఖత్ తీరు నాకు నచ్చలేదు...
‘ఔను... పోరు ముగిశాక చేయి కలపలేదు. మరి ఆమె ఏం చేసిందో మీకు తెలియదా? బయటికి మాత్రం మేరీ నా అభిమాన, ఆరాధ్య బాక్సర్ అని... మార్గదర్శి అని చెప్పుకునే ఆమెకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? ఇతరుల నుంచి గౌరవ మర్యాదలు పొందాలనుకుంటున్న నిఖత్‌కు ఎదుటి వారికి కూడా కనీస గౌరవం ఇవ్వాలన్న ఇంగితం లేదా? నన్ను నేరుగా క్వాలిఫయర్స్‌కు పంపాలని భారత బాక్సింగ్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. నన్నే పంపించాలని నేనేమీ వారిని కోరలేదు. ఈ అంశంపై ఏదైనా ఉంటే బాక్సింగ్ రింగ్‌లో తేల్చుకోవాలి. కానీ ఆమె ఏం చేసింది... మీడియాలో రచ్చ రచ్చ చేసింది. కేంద్ర క్రీడల మంత్రికి లేఖ రాసి నానాయాగీ చేసింది. ఆటగాళ్లు రింగ్‌లో తలపడాలి. బయట కాదు..! అలాంటి ప్రత్యర్థి తీరు నాకు నచ్చలేదు. అందుకే షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు’ అని మేరీకోమ్ పేర్కొంది.
నేను హత్తుకోవాలనుకున్నా...
‘నా శక్తిమేర రాణించాను. ఈ ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నా. కానీ బౌట్ ముగిశాక మేరీకోమ్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదు. ఓ సీనియర్ బాక్సింగ్ దిగ్గజం నా ప్రదర్శనకు మెచ్చి హత్తుకుంటుందనుకుంటే కనీసం చేయి కూడా కలపలేదు. ఇది నన్ను తీవ్రంగా బాధించినా... దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను. ఈ ఒక్క ట్రయల్‌తో నా ‘టోక్యో’ దారి మూసుకుపోలేదు. ఆమె ఒక వేళ ఫిబ్రవరిలో జరిగే ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో విఫలమైతే... ప్రపంచ క్వాలిఫయర్స్ కోసం మే నెలలో జరిగే ట్రయల్స్ ద్వారా మరో అవకాశముంటుంది. అప్పుడు మరింత శ్రమించి బరిలోకి దిగుతాను.
–నిఖత్ జరీన్
Comments
Please login to add a commentAdd a comment