తొలి టీఎన్‌పీఎల్ విజేత పేట్రియాట్స్
చెన్నై: మొదటి సారి నిర్వహించిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో ఆల్బర్ట్ ట్యుటి పేట్రియాట్స్ విజేతగా నిలిచింది. ఆదివారం చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్లో పేట్రియాట్స్ 122 పరుగుల భారీ తేడాతో చేపాక్ సూపర్ గిల్లీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పేట్రియాట్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్ (52 బంతుల్లో 82 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్), కౌశిక్ గాంధీ (43 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 55; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు.
అనంతరం గిల్లీస్ 18.5 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. శరవణన్ (30) టాప్ స్కోరర్. ఇన్నింగ్‌స తొలి ఓవర్లోనే పేట్రియాట్ లెఫ్టార్మ్ స్పిన్నర్ గణేశ్ మూర్తి ’హ్యాట్రిక్’ సహా నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. సున్నా పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన గిల్లీస్ జట్టు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. మరో వైపు 30 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య చరిత్రాత్మక ’టై’ టెస్టులో భాగమైన ఇరు జట్ల క్రికెటర్లు కొందరిని ఫైనల్ సందర్భంగా తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ సత్కరించారు.