తనకు టెస్టుల్లో ఆడే అవకాశం ఇవ్వాలని టీమిండియా యువ ఆల్‌రౌండర్ ఆర్. సాయి కిశోర్ సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. భారత్‌లో ఉన్న ఉత్తమ స్పిన్నర్లలో తానూ ఒకడినని.. ఒక్క అవకాశం ఇస్తే తనను తాను నిరూపించుకుంటానని మేనేజ్‌మెంట్‌ను అభ్యర్థించాడు. తమిళనాడుకు చెందిన సాయి కిశోర్ ఆసియా క్రీడలు-2023 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలిసారి పంపిన క్రికెట్ జట్టులో భాగమైన ఈ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్.. మొత్తంగా మూడు టీ20లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాయి కిశోర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా అత్యుత్తమ గణాంకాలు(4/33) నమోదు చేశాడు.
మెడకు తీవ్ర గాయం
అయితే, ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. మ్యాచ్‌ల విరామ సమయంలో గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన సాయి కిశోర్.. మెడకు తీవ్రమైన గాయమైంది. ఫలితంగా ఐపీఎల్-2024 మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ అతడు దూరం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో పునరావాసం పొందిన సాయి.. ఈ ఏడాది జూలైలో తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా తిరుప్పూర్ తమిళన్స్ తరఫున పునరాగమనం చేశాడు.
తదుపరి దులిప్ ట్రోఫీ-2024లో సాయి భాగం కానున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమ్-బిలో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన సాయి కిశోర్.. తీవ్రమైన గాయం నుంచి కోలుకోవడం వెనుక ఎన్‌సీఏ ఫిజియోల కృషి ఎంతగానో ఉందని తెలిపాడు. వారితో పాటు తన భార్య కూడా కంటికి రెప్పలా కాచుకుని తనను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చిందన్నాడు.
భయపడ్డాను
‘‘మనం నడవాలన్నా.. నిద్రించాలన్నా.. దేనికైనా మెడనే ఉపయోగిస్తాం. మెడకు గాయమైన తర్వాత.. క్రికెట్ మాట పక్కనపెడితే.. నేనసలు తిరిగి సాధారణ జీవితం గడపుతానో లేదోనని భయపడ్డాను. ఆటకు దూరమైనా బాధను దిగమింగుకోవాలని నా మనసును సన్నద్ధం చేసుకున్నాను. అయితే, తులసి అన్న(తులసిరామ్ యువరాజ్, ఎన్‌సీఏలో ఫిజియో) నేను కోలుకోవడంలో ఎంతో తోడ్పాటునందించారు.
నా వ్యక్తిగత మసాజర్, ట్రైనర్ హర్షా.. ఇలా అందరూ నాకు సహాయం అందించారు. గాయం వల్ల అసలు ఎక్కువ సేపు కూర్చునే వీలు కూడా ఉండేది కాదు. ప్రతి పనికీ ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చేది. నా భార్య సహకారం వల్లే ఇప్పుడిలా కోలుకోగలిగాను’’ అని సాయి కిశోర్ తెలిపాడు.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి
ఇక తనకు టెస్టుల్లో ఆడాలని ఉందన్న సాయి కిశోర్.. రవీంద్ర జడేజాతో కలిసి ఒక్క మ్యాచ్‌లో భాగమైనా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘దేశంలోని ఉత్తమ స్పిన్నర్లలో నేనూ ఒకడినని భావిస్తా. టెస్టుల్లో నన్ను ఆడించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జడేజాతో కలిసి ఆడటం నాకు ఇష్టం. అతడిని దగ్గరగా గమనిస్తూ.. తన నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని సాయి కిశోర్ తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు.
Comments
Please login to add a commentAdd a comment