ఆ ‘నాలుగు’ అమలు కష్టమే | Twelve state associations ready to comply with Lodha reforms | Sakshi
Sakshi News home page

ఆ ‘నాలుగు’ అమలు కష్టమే

Published Fri, May 11 2018 1:23 AM | Last Updated on Fri, May 11 2018 1:23 AM

Twelve state associations ready to comply with Lodha reforms - Sakshi

న్యూఢిల్లీ: క్రికెట్‌ బోర్డులో అమలు చేయాల్సిన లోధా కమిటీ సిఫార్సుల్లో ‘ఆ నాలుగు’ ప్రధాన అడ్డంకి అని 12 రాష్ట్రాల సంఘాలు... కోర్టు సహాయకుడి (అమికస్‌ క్యూరీ)కి నివేదిక అందజేశాయి. తదుపరి విచారణ (మే 11)కు ముందే తమకు అభ్యంతరకరమైన సిఫార్సులేవో కోర్టు సహాయకుడు గోపాల్‌ సుబ్రమణియంకు తెలియ జేయాలంటూ సుప్రీం కోర్టు గత విచారణ సందర్భంగా బీసీసీఐ, అనుబంధ రాష్ట్ర సంఘాలకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అనుబంధంగా ఉన్న 37 సంఘాల్లో 12 సంఘాలు తమకు ఇబ్బందికరమైన నాలుగు సిఫార్సుల్ని ఆ నివేదికలో వివరించాయి. అందులో 1. ఒక రాష్ట్రానికే ఒకే ఓటు, 2. పదవుల మధ్య మూడేళ్ల విరామం, 3. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, 4.ఆఫీసు బేరర్లు, ప్రొఫెషనల్స్‌ (కోర్టు నియమించమన్న సీఈఓ, సీఎఫ్‌ఓ) మధ్య అధికార పంపకం అమలు చేయడం కష్టమని ఆంధ్ర, అస్సాం, గోవా, జార్ఖండ్, కేరళ, ముంబై, రాజస్తాన్, రైల్వేస్, త్రిపుర, యూనివర్సిటీస్, ఉత్తరప్రదేశ్, విదర్భ సంఘాలు తెలిపినట్లు బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి మీడియాకు వెల్లడించారు.

‘ఒక రాష్ట్రానికి ఒకే ఓటంటే మహారాష్ట్ర (ముంబై, విదర్భ, మహారాష్ట్ర), గుజరాత్‌ (బరోడా, సౌరాష్ట్ర, గుజరాత్‌) లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఉన్న మూడేసి సంఘాలకు ప్రాతినిధ్యం కరువవుతుంది. పదవికి పదవికి మధ్య కనీసం మూడేళ్ల విరామమంటే ఎన్నికైన ఆఫీస్‌ బేరర్‌కు కొనసాగే వీలే ఉండదు. ఉన్నతస్థాయి కమిటీ, అధికార పంపకాల వల్ల కొత్త సమస్యలు వస్తాయని క్రికెట్‌ సంఘాలు వాపోతున్నాయి’ అని అమితాబ్‌ చెప్పారు. మొత్తం మీద నేడు సుప్రీం కోర్టులో లోధా కమిటీ సిఫార్సులపై విచారణ జరుగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement