ముంబై: ఐపీఎల్‌లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం అంచున నిలిచి క్రమంగా ఓటమి ఒడిలోకి జారుకుంది. అయితే ఆర్సీబీ ఓటమికి కారణం ఆ జట్టు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రానే కారణమంటూ అభిమానులు విరుచుకుపడుతున్నారు. గెలుపు ముంగిట నిలిచిన జట్టును నెహ్రా ఓటమి కోరల్లోకి నెట్టేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 171 పరుగులు చేసింది. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. చివరి రెండు ఓవర్లలో విజయానికి 22 పరుగులు అవసరం. క్రీజులో హార్దిక్ పాండ్యా, పొలార్డ్ ఉన్నారు. దీంతో 19వ ఓవర్‌ను పేసర్ నవదీప్ సైనీతో వేయించాలని ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి భావించాడు. అయితే, బౌలింగ్ ఆశిష్ నెహ్రా మాత్రం పవన్ నేగీతో వేయించాలని డగౌట్ నుంచి సూచించాడు. నెహ్రా సూచన మేరకు పవన్ నేగీకి కోహ్లి బంతిని అందించాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న పాండ్యా.. నేగి బౌలింగ్‌ను చీల్చి చెండాడు. విజయానికి అవసరమైన 22 పరుగులను ఆ ఓవర్‌లోనే సాధించి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇది చూసిన బెంగళూరు అభిమానులు నెహ్రాపై మండిపడుతున్నారు. జట్టు ఓటమికి అతడే కారణమంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. పాండ్యా, పొలార్డ్ వంటి బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉన్నప్పుడు నేగీలాంటి స్పిన్నర్లకు బౌలింగ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 19వ ఓవర్‌ను నేగీకి ఇవ్వకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు. నెహ్రా తలచుకుంటే స్టేట్ టాపర్‌ను కూడా యూనిట్ టెస్టులో ఫెయిల్ చేస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశిష్ నెహ్రా ఒక బౌలింగ్ కోచ్ అంటే నమ్మలేకపోతున్నామని మండిపడుతున్నారు. ఇక ఆశిష్ సేవలు చాలు.. అతన్ని తీసేయండి అంటూ ధ్వజమెత్తుతున్నారు. ఫీల్డ్‌లో కెప్టెన్ పాత్రలో ఉన్న కోహ్లి.. నెహ్రా చెప్పిన సలహాకు ప్రభావితం కావడం ఏ మాత్రం బాలేదని చురకలు అంటిస్తున్నారు.
(ఇక్కడ చదవండి: బెంగళూరు కథ కంచికే! )
Comments
Please login to add a commentAdd a comment