భలే బాల్‌బాయ్స్!
యూఎస్ ఓపెన్‌లో సందడి
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో విజయం సాధించేందుకు అగ్రశ్రేణి ఆటగాళ్లంతా కోర్టుల్లో ఒక వైపు పోటీ పడుతుంటే అవే కోర్టుల్లో ’అడుగు’ కోసం మరో రకమైన పోటీ అక్కడ ఉంటుంది. అక్కడ లభించే డబ్బు మరీ ఎక్కువ కాకపోవచ్చు. కానీ ఆ కాసింత చోటు దొరికితే చాలనుకున్న కుర్రాళ్లు చాలా మంది ఉంటారు. యూఎస్ ఓపెన్‌లో ఈ సారి కూడా ‘బాల్ బాయ్స్’ బాధ్యతల కోసం పెద్ద సంఖ్యలో పోటీ నడిచింది. గంటల పాటు క్యూలో నిల్చొని వారు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. 2-3 నిమిషాల్లో తాము బాల్ బాయ్‌గా ఎలా పనికొస్తామో వారు చూపించాల్సి ఉంటుంది.
వేగంగా పరుగెత్తడం, బంతిని అందుకోవడం, సరైన విధంగా త్రో చేయడంలాంటివి పరీక్షించి అవకాశం ఇస్తారు. కనీసం 14 ఏళ్ల వయసు ఉండాలి. బాల్ బాయ్స్ అంటే అబ్బారుులు మాత్రమే కాదండోయ్ వారిలో అమ్మారుులు కూడా ఉంటారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను వడబోసి 200 మందిని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఎంపిక చేశారు. వీరికి న్యూయార్క్ కనీస వేతనాల చట్టం ప్రకారం గంటకు కనీసం 9 డాలర్లు చెల్లిస్తారు! నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో బాల్ బాయ్స్‌కు డబ్బులు ఇచ్చేది ఒక్క యూఎస్ ఓపెన్‌లో మాత్రమే కావడం విశేషం. వీటికి తోడు రెండు జతల డ్రెస్ కిట్‌లు కూడా ఇస్తారు.
‘ఇది నా జీవితంలో మరపురాని మూడు వారాల సమయం. మ్యాచ్‌ను బాగా చూసేందుకు స్టేడియంలో అందరికంటే బెస్ట్ సీట్ నాదే‘ అని హైస్కూల్ అమ్మాయి మాడిసన్ కలినాన్ సంతోషం ప్రకటిస్తే, ‘ఇంత మంది ఆటగాళ్లను దగ్గరి నుంచి చూసి వారితో మాట్లాడే అవకాశం కూడా రావడానికి మించిన బహుమతి నాకేమీ లేదు‘ అని డార్విష్ అనే కుర్రాడు చెప్పాడు. అన్నట్లు ఆరంభంలో వీరిలో ఎక్కువ మందికి పెద్దగా ప్రాధాన్యత లేని మ్యాచ్‌లు జరిగే బయటి కోర్టుల్లోనే అవకాశం కల్పిస్తారు. అక్కడ మంచి ప్రతిభ కనబర్చి ఆర్మ్‌ట్రాంగ్ గ్రాండ్ స్టాండ్, ఆర్థర్ యాష్ సెంటర్ కోర్టులోకి ప్రమోషన్ తెచ్చుకోవాలనేదే వీరి కోరిక!