న్యూఢిల్లీ: గ్రామీణ క్రీడ ఖో–ఖో మరింత ఆకర్షణీయంగా మారనుంది. క్రికెట్, కబడ్డీ, రెజ్లింగ్ తరహాలోనే ఖో–ఖోలోనూ ఇటీవల లీగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్‌లో ‘అల్టిమేట్ ఖో–ఖో’ పేరుతో జరుగనున్న ఈ లీగ్... తొలి సీజన్‌తోనే ప్రేక్షకాదరణ పొందేం దుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఖో–ఖో ఆట నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఇందులో భాగంగా ఆట మొత్తం నిడివిని 36 నిమిషాల నుంచి 28 నిమిషాలకు తగ్గించింది. దీంతో రెండు ఇన్నింగ్స్‌లలోనూ ప్రతి జట్టు ఏడు నిమిషాల చొప్పున ఆడుతుంది. దీంతో ఆటలో వేగం పెరగడంతో పాటు ఆసక్తికర పోరాటాలు ప్రేక్షకులని రంజింపచేస్తాయని నిర్వాహకులు భావిస్తున్నారు. దీనితో పాటు అధిక పాయింట్లు పొందడానికి వీలుగా ‘వజీర్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.
దీని ప్రకారం వజీర్‌గా వ్యవహరించే ఆటగాడు అయితే తనకు అనుకూలంగా అయితే ఎడమవైపు, లేదా కుడివైపుకు పరిగెత్తి పాయింట్లను సాధించవచ్చు. వజీర్ ట్రంప్‌కార్డుగా ఉపయోగపడుతూ పాయింట్లు పెంచుకునేందుకు ఉపయోగపడతాడు. అంతేకాకుండా స్కోరింగ్ విధానంలోనూ కొన్ని మార్పుచేర్పులు చేశారు. దీని ప్రకారం స్కైడైవ్ ద్వారా జట్టుకు అదనంగా ఒక పాయింట్ సాధించే వీలుంటుంది. మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఆటగాళ్లకు రివ్యూ కోరే అవకాశాన్ని కూడా కల్పించారు. ప్రతి ఇన్నింగ్స్‌లో రెండు రివ్యూలు కోరవచ్చు. ఒకవేళ రివ్యూలో విఫలమైతే ప్రత్యర్థి జట్టుకు ఒక పాయింట్‌ను కేటాయిస్తారు. ఈ మార్పులు అభిమానులకు ఖో–ఖోను మరింత చేరువ చేస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కొత్త ఫార్మాట్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని భారత ఖో–ఖో సమాఖ్య చైర్మన్ రాజీవ్ మెహతా అన్నారు. భారత్‌లో నైపుణ్యమున్న ఆటగాళ్లకు అల్టిమేట్ ఖో–ఖో లీగ్ మంచి అవకాశమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment