కరాచీ: పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద ఆయనను సస్పెండ్ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పీసీబీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ ముగిసే వరకు అక్మల్ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు. ‘ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నందున పీసీబీ దీనిపై ముందు ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోదు’ అని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో పీఎస్‌ఎల్‌లో భాగంగా ఒక బుకీ సంప్రదించిన విషయాన్ని దాచి పెట్టిన కారణంగానే అతనిపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.
ఓ ఫిట్‌నెస్ టెస్ట్ సందర్భంగా ఉమర్ అక్మల్ దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే అతడిపై సస్పెన్షన్ వేటు పడాల్సి ఉండగా దాని నుంచి తప్పించుకున్నాడు. లాహార్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీ వద్ద జరిగిన ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైన అక్మల్... అక్కడి సిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. (ఇక్కడ చదవండి: మేము వదిలేసుకోవడానికి సిద్ధం: పాకిస్తాన్)
కొన్ని రోజుల క్రితం ఈ ఘటనపై అక్మల్ క్షమాపణలు కోరిన క్రమంలో అతనిపై ఎటువంటి నిషేధం విధించడం లేదని పీసీబీ తెలిపింది. ఇప్పుడు అవినీతి నిరోధక నియమావళిని అతిక‍్రమించిన కారణంగా అక్మల్‌ను సస్పెండ్ చేశారు. గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున అక్మల్ చివరిసారి కనిపించాడు. ఆ సిరీస్‌లో అక్మల్ ఘోరంగా విఫలం కావడంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్ జట్టులో అక్మల్ చోటు కోల్పోయాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) ఆరంభానికి ముందు అక్మల్‌ను సస్పెండ్ చేయడం గమనార్హం. ఈ రోజు నుంచి పీఎస్‌ఎల్ ఆరంభం కానుంది. (ఇక్కడ చదవండి: అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేసేశాడు..!)
Comments
Please login to add a commentAdd a comment