కరాచీ: పాకిస్తాన్ క్రికెట్‌లో మళ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగడంతో ఆ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యత రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు అవినీతికి పాల్పడ్డ పాక్ క్రికెటర్లపై జీవితకాలం నిషేధం విధించేలా పార్లమెంట్‌లో చట్టం చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు విజ్ఞప్తి చేశాడు. గతంలో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో ఫిక్సింగ్ చేయమని తనను కొంతమంది సంప్రదించిన విషయాన్ని పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ దాచి పెట్టాడు. ఇది తాజా విచారణలో తేలడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద అతన్ని సస్పెండ్ చేసింది. దీనిపై పూర్తి విచారణ జరిగే వరకూ అక‍్మల్‌పై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. దీంతో పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ ముగిసే వరకు అక్మల్ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు. ఈ క్రమంలోనే తాజా పీఎస్‌ఎల్‌ను అక్మల్ మిస్సయ్యాడు. (ఇక్కడ చదవండి: అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేసేశాడు..!)
అయితే ఈ తరహా క్రికెటర్లను అసలు క్రికెట్ ఆడకుండా జీవితకాలం నిషేధం విధించాలని రమీజ్ రాజా డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు పార్లమెంట్‌లో చట్టం చేయాలని ప్రధాని ఇమ్రాన్‌ను కోరాడు. ‘ షార్జిల్, ఖలీద్‌ల ఫిక్సింగ్ వ్యవహారం నిన్ననో-మొన్ననో జరిగినట్లు ఉంది. అది ఇంకా కళ్లు ముందు ఉండగానే మరొక ఫిక్సింగ్ కలకలం. పాకిస్తాన్ క్రికెట్‌లో ఇలా జరగుతూ ఉండటం నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. మరొకవైపు అసహ్యం కూడా వేస్తోంది. ఇక నుంచి ఫిక్సింగ్ చేసేవాళ్లు జీవిత కాలం నిషేధం విధించేలా చట్టం అవసరముంది. న్యూజిలాండ్ తరహా దేశాల్లో ఫిక్సింగ్ చేస్తే చాలా కాలం వరకూ వారికి అవకాశమే ఉండదు. ఫిక్సింగ్‌లో దోషి అని తేలితే జీవితం కాలం వేటే సరైనది’ రమీజ్‌రాజా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment