
ముంబై: ఇండియన్స్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో సంచల ప్రదర్శన నమోదైంది. మంగళవారం ఇక్కడ వాంఖేడే స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి ఓవర్ మొదటి రెండు బంతుల్లో రెండు వికెట్లను కోల్పోయింది. ఆర్సీబీ పేసర్ ఉమేష్ యాదవ్ వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికి సూర్యకుమార్ యాదవ్ బౌల్డ్ కాగా, రెండో బంతికి ఇషాన్ కిషాన్ సైతం బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఈ ఇద్దరూ గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం ఇక్కడ గమనార్హం.
టాస్ గెలిచిన ఆర్సీబీ.. ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో ముంబై బ్యాటింగ్‌ను సూర్యకుమార్ యాదవ్, లూయిస్‌లు ఆరంభించారు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ స్టైకింగ్ తీసుకోగా, లూయిస్ నాన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. ఉమేశ్ యాదవ్ వేసిన గుడ్ లెంగ్త్ బంతికి సూర్యకుమార్ యాదవ్ వికెట్లను సమర్పించుకోగా, ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషాన్ కూడా అదే బాటలో పయనించాడు. దాంతో ముంబై ఇండియన్స్ పరుగులేమీ లేకుండానే రెండు వికెట్లను కోల్పోయింది. ఈ సీజన్‌లో మొదటి ఓవర్‌లో తొలి బంతికి వికెట్‌ను సమర్పించుకున్న అపప్రథను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోవడంతో పాటు ఆ మరుసటి బంతికి వికెట్‌ను కోల్పోయిన చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment