‘అది ఎలా సాధ్యమవుతుందో.. నేనే నమ్మలేకున్నా’ | Unbelievable How Bumrah Executes Yorkers Malinga | Sakshi
Sakshi News home page

‘అది ఎలా సాధ్యమవుతుందో.. నేనే నమ్మలేకున్నా’

Published Sat, Nov 30 2019 3:39 PM | Last Updated on Sat, Nov 30 2019 3:59 PM

Unbelievable How Bumrah Executes Yorkers Malinga - Sakshi

కొలంబో:  ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో యార్కర్లు, స్లోబాల్స్‌ సంధించడంలో టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాది ప్రత్యేక స్థానం. ఆట ఆరంభంలో కానీ, చివర్లో కానీ మ్యాచ్‌ను శాసించడంలో బుమ్రా దిట్ట. కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించడంలో బుమ్రా ఎంతో పరిణితి సాధించాడు. దాంతోనే భారత క్రికెట్‌ జట్టులో రెగ్యులర్‌ బౌలర్‌గా మారిపోయాడు. తన అరంగేట్రం మొదలుకొని ఇప్పటివరకూ బుమ్రా బౌలింగ్‌ను విమర్శించిన దాఖలాలు దాదాపు లేవంటేనే అతని బౌలింగ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక సీనియర్‌ పేసర్‌ లసిత్‌ మలింగా నుంచి యార్కర్ల టిప్స్‌ను ఒక్కొక్కటిగా తెలుసుకున్న బుమ్రా.. ఇప్పుడు ‘ముదురు’ బౌలర్‌ అయిపోయాడు. ఎంతలా అంటే అసలు అంత కచ్చితమైన యార్కర్లు ఎలా వేస్తున్నాడో గురువు మలింగాకు తెలియనంతగా బుమ్రా రాటుదేలిపోయాడు.

ఇదే విషయాన్ని ఇప్పుడు మలింగ్‌ సైతం ఒప్పుకున్నాడు. ‘ అతని బౌలింగ్‌ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. బుమ్రా అంత కఠినమైన యార్కర్లను ఎలా సంధిస్తున్నాడు. అది ఎలా సాధ్యమవుతుందో.. దాన్ని నేనే నమ్మలేకున్నా. నేను బుమ్రా బౌలింగ్‌ మెరుగు పడటానికి కొన్ని సలహాలు ఇచ్చా. అందుకు చాలా సంతోషంగా ఉంది. తన బుర్రతో నేనిచ్చిన టిప్స్‌కు మరింత పదును పెట్టాడు. బుమ్రా ఏ విషయాన్నైనా తొందరగానే నేర్చుకుంటాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇద్దరం కలిసి ఆడటంతో బౌలింగ్‌ మెళకువలను నాతో షేర్‌ చేసుకునే వాడు. ఏదైనా చెబితే దాన్ని వెంటనే అమలు చేసేవాడు. నా కంటే మంచి ఫలితాల్ని రాబట్టడంలో బుమ్రా సక్సెస్‌ అయ్యాడు’ అని మలింగా కొనియాడాడు. ఇక సీనియర్‌ క్రికెటర్లు యువ క్రికెటర్లకు సూచనలు ఇవ్వాల్సిన అవరసం ఉందని మలింగా తెలిపాడు. యువ క్రికెటర్లలోని సత్తాను బయటకు తీయాలంటే సీనియర్‌ క్రికెటర్లు వారికి తగిన సూచనలు ఇవ్వడానికి ఎప్పుడూ ముందుండాలన్నాడు.

2008లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతూ వస్తున్న బుమ్రా.. 2018లో అదే ఫ్రాంచైజీకి మెంటార్‌గా పని చేశాడు. 2019లో ఆటగాడిగా మళ్లీ ముంబై తరఫున బరిలోకి దిగాడు. ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌ను చివరి వికెట్‌గా మలింగా ఔట్‌ చేయడంతో ముంబై ట్రోఫీని గెలిచింది. ఇక 2013 నుంచి బుమ్రా ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ వస్తున్నాడు. దాంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది.  వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్‌లో కూడా మలింగా-బుమ్రాలు ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ముంబై ఇండియన్స్‌ వీరిని జట్టుతో పాటు అంటిపెట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement