ఫతుల్లా: అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శనివారం నమీబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువ భారత్ దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్ లో కుమ్మేసిన యువ భారత్.. ఆపై బౌలింగ్ లో నమీబియాను కుప్పకూల్చింది. నమీబియాపై 197 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ సెమీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 349 భారీ పరుగులు సాధించింది. భారత్ ఆటగాళ్లలో కెప్టెన్ ఇషాన్ కిషన్(6) ఆదిలోనే పెవిలియన్ కు చేరినా, రిషబ్ పంత్ (111;96 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం అన్మూల్ ప్రీత్ సింగ్(41), సర్ఫరాజ్ ఖాన్(76), ఆర్మాన్ జాఫర్(64), లామ్రోర్(41 నాటౌట్) దాటిగా ఆడటంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది. నమీబియా బౌలర్లలో కోట్జీ మూడు వికెట్లతో రాణించాడు.
ఆపై 350 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన నమీబియా 39.0 ఓవర్లలో 152 పరుగులకే చాపచుట్టేసి ఓటమి పాలైంది. పటిష్టమైన భారత బౌలింగ్ ముందు నిలబడలేక చేత్తులెత్తేసిన నమీబియా ఏ దశలోనూ ప్రతిఘటించలేదు.నమీబియా ఆటగాళ్లలో డావిన్(33), లాఫ్టీ ఈటన్(22), గ్రీన్(27), లిండే(25 ) మోస్తరుగా ఆడటంతో ఆ జట్టు ఘోర ఓటమి మూటగట్టుకుంది. భారత బౌలర్లలో మయాంక్ దాగర్, అన్మూల్ ప్రీత్ సింగ్లు తలో మూడు వికెట్లు సాధించగా, వాషింగ్టన్ సుందర్కు రెండు వికెట్లు, ఖలీల్ అహ్మద్, బాథమ్ లకు చెరో వికెట్ లభించాయి.
క్వార్టర్స్ లో దుమ్మురేపిన యువ భారత్
Published Sat, Feb 6 2016 3:05 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM
Advertisement