సచిన్, సిఎన్ఆర్ రావులకు భారతరత్న
భారత క్రికెట్ కు విశేష సేవలు అందించిన సచిన్ టెండూల్కర్‌కు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ప్రకటించింది. సచిన్ తోపాటు సైన్స్‌లో విశేష సేవలు అందించిన ప్రధాని సాంకేతిక సలహాదారుడు సిఎన్ఆర్ రావుకు కూడా భారత తర్న ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం శనివారం ప్రకటించింది. ఇదే రోజు కెరీర్‌కు వీడ్కోలు పలికిన మాస్టర్‌కు పురస్కారం ప్రకటించడం విశేషం.
భారత క్రీడా చరిత్రలో అత్యున్నత పౌరపురస్కారం అందుకోనున్న తొలి క్రీడాకారుడిగా సచిన్ ఘనత సాధించనున్నాడు. ఈ అవార్డుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడు కూడా మాస్టరే (40) కావడం విశేషం. భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించినందుకుగాను ఈ అవార్డును బహూకరించనున్నారు. మాస్టర్‌కు భారతరత్న ఇవ్వాలని పలువురు రాజకీయ నాయకులు, వివిధ రంగాల వ్యక్తులు రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. మొదట హాకీ దిగ్గజం ధ్యాన్చంద్కే ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేసినా సచిన్‌నే వరించింది.
సచిన్ రిటైర్మెంట్ రోజునే అవార్డు ప్రకటన వెలువడంతో అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముంబైలో రమేశ్ టెండూల్కర్, రజని దంపతులకు జన్మించిన సచిన్ భారత క్రికెట్‌కు 24 ఏళ్ల పాటు సేవలు అందించాడు. లెక్కకుమిక్కిలి రికార్డులు నెలకొల్పాడు. రెండు వందల టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా, అంతర్జాతీయ కెరీర్లో వంద సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా మాస్టర్ చరిత్ర సృష్టించాడు. టెస్టు, వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ కూడా సచినే కావడం విశేషం. సచిన్ గౌరవార్థం ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది.