BharatRatna
-
'ఘంటసాలకు భారతరత్న వస్తే అవార్డుకే అందం'
స్వాతంత్ర సమరయోధుడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుకు భారతరత్న వచ్చేందుకు మనమంతా కృషి చేయాలని ప్రముఖ టాలీవుడ్ దర్శకులు ఆదిత్య, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా కేంద్రం అవార్డు ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని నీలిమ గడ్డమణగు వ్యాఖ్యాతగా సెప్టెంబర్ 18న వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అంశంపై అమెరికాలోని శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ' మీరందరు విదేశాల్లో ఉండి కూడా ఘంటసాలకి భారతరత్న రావాలన్న మీ ప్రయత్నాలకు మా అందరి తరఫున అభినందనలు. ముఖ్యంగా ఘంటసాల కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడం, అందరినీ కలుపుకొని పోవడం అభినందనీయం. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఘంటసాల జాతీయ సంపద.. స్వాతంత్ర సమరయోధుడు. వందల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం, కొన్ని వేల పాటలు పాడటం ఇలా అన్ని విధాలుగా వారు భారతరత్నకు అర్హులు' అని అన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'ఈ కార్యక్రమం గురించి ఈ మధ్యనే విన్నా. ఘంటసాలకు భారతరత్న వస్తే అది భారతరత్నకే అందం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు అందిస్తే మా నాన్న నాకు ఘంటసాల పాటలు, సాహిత్యాన్ని అందించారు. అదే మా నాన్న నాకిచ్చిన వారసత్వం. ఆయన పాటలు, సాహిత్యాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తూ వారికి పూర్తి సహకారం అందిస్తానని' తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ 'ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం. ఇది చాలా గొప్ప కార్యక్రమం. మా ముందు తరాల వారికీ ఆయన ఒక దేవుడు. సంగీతం లో గాన గంధర్వుడు. మంచి గాయకుడే కాకుండా 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. నాకు ఘంటసాల పాటలు అంటే చాలా ఇష్టం. ఆయన సంగీత దర్శకత్వం వహించిన రెండు సినిమాలు మాయాబజార్, గుండమ్మ కథ. ఆ సినిమాలో వారు పాడిన పాటలు ఇప్పటికి ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన శతజయంతి ఉత్సవాలు జరపడం గొప్ప విషయం. మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. ఆయనకు భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'అని అన్నారు. ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాలకి కేంద్రం భారతరత్న అవార్డుతో సత్కరించాలని కోరారు. విదేశాల్లోని తెలుగు సంస్థలు, ఇతర సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో గతంలో ఘంటసాల కార్యక్రమాలకు సాంకేతిక సహాయం అందించిన ప్రమీలకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ప్రముఖ మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, ప్రముఖ సింగర్స్ గీత మాధురి, మాళవిక, ఇండియన్ ఐడల్ రన్నరప్ రోహిత్, అనురూప్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, శంకర్ నేత్రాలయ, యూఎస్ఏ బోర్డు సభ్యులు సౌమియా నారాయణన్, లక్ష్మయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ధర్మభిక్షానికి భారతరత్న ఇవ్వాలి
సంస్థాన్‌నారాయణపురం: స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షానికి కేంద్రం భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్మభిక్షం విగ్రహాన్ని శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జీవిత చరిత్రను పాఠ్యంశాలుగా చేర్చడానికి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ధర్మభిక్షం విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో గీత కార్మికుల సంక్షేమానికి నీరా పాలసీ తీసుకొచ్చామన్నారు. కార్మికులు ప్రమాదం జరిగి మృతి చెందితే రూ.5 లక్షల పరిహారం, గాయాలైతే రూ.10 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. కుల వృత్తుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, గీత పనివారల సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం
చెన్నై : తమిళనాట రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ ఓ తీర్మానాన్ని పాస్ చేసింది.. ఈ తీర్మానంతో పాటు రూ.15 కోట్లతో అమ్మ స్మారకమందిరాన్ని నిర్మించాలనే తీర్మానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. అమ్మ మరణాంతరం తొలిసారి భేటీ అయిన కొత్త కేబినెట్ ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పార్లమెంట్ క్యాంపస్ లోపల కూడా అమ్మ కాంస్య విగ్రహాన్ని కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. మెరీనా బీచ్‌లో నిర్మించిన ఎంజీఆర్ మెమోరియల్ పేరును భారతరత్న డాక్టర్ ఎంజీఆర్‌గా మార్చనున్నట్టు కేబినెట్ తెలిపింది. అక్కడే జయలలిత మెమోరియల్‌ను నిర్మించనున్నట్టు పేర్కొంది. కోలుకుంటుదన్న అమ్మ డిసెంబర్ 5న అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడం, అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై డిసెంబర్ 6న అసువులు బాసిన సంగతి తెలిసిందే. అమ్మ మరణాంతరం వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 31 మంది కొత్త మంత్రులచే కూడా ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణం చేపించారు. పన్నీర్ సెల్వం నేతృత్వంలో తొలిసారి కేబినెట్ శనివారం సచివాలయంలో భేటీ అయింది. ఈ భేటీలో అమ్మ జయలలితకు మంత్రులు శ్రద్ధాంజలి ఘటించి, ఈ మేరకు తీర్మానాలు ఆమోదించారు. -
'ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందే'
హైదరాబాద్: నేడు దివంగత సీఎం, నటుడు ఎన్టీఆర్ 92 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఆయన కుటుంబం నివాళులర్పించింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాప్తిచేసింది ఎన్టీఆర్ అని ఆయన కుమారుడు, నటుడు హరికృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తెలుగువారందరి తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా కలిసిమెలిసి ఉండాలన్నదే ఎన్టీఆర్ ఆశయమని, కలిసికట్టుగా లక్ష్యాలను సాధించుకోవాలని హరికృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పురందేశ్వరీ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు. వీరితో పాటు దర్శకుడు వైవీఎస్ చౌదరి, ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. -
పీవీకి భారతరత్న ఇవ్వాల్సింది: కేసీఆర్
హైదరాబాద్ : మాజీ ప్రధాని వాజ్‌పేయి, స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యలకు భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాగా మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వకపోవటం వెలితిగా ఉందని కేసీఆర్ అన్నారు. పీవీకి భారతరత్న ఇచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన బుధవారమిక్కడ పేర్కొన్నారు. ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాల్సిందన్నారు. కాగా తెలంగాణ అసెంబ్లీలో పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. -
'సచిన్ కంటే ముందు ధ్యాన్చంద్కే భారతరత్న ఇవ్వాలి'
దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డు అర్హుల ఎంపికపై వివాదం కొనసాగుతోంది. ఈ జాబితాలో తాజాగా భారత అథ్లెట్ దిగ్గజం మిల్కాసింగ్ చేరాడు. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కంటే ముందు హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌కు భారతరత్నఇవ్వాలని అన్నాడు. సచిన్‌కు అవార్డు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకించడం లేదని, అయితే ధ్యాన్‌చంద్‌ను మొదటు అవార్డుతో గౌరవిస్తే సంతోషిస్తానని మిల్కాసింగ్ చెప్పాడు. సచిన్ రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించాడు. భారతరత్న అవార్డీల జాబితాలో క్రీడాకారులను తొలిసారి చేర్చడం పట్ల మిల్కాసింగ్ హర్షం వ్యక్తంచేశాడు. చాలామంది ప్రముఖులు సచిన్‌కు భారతరత్న ఇవ్వడాన్ని వ్యతిరేకించకపోయినా.. మాజీ ప్రధాని వాజ్‌పేయి, ధ్యాన్‌చంద్‌ను సత్కరించకపోవడాన్ని విమర్శిస్తున్నారు. వీరిద్దరికి భారతరత్న అవార్డు ఇవ్వాలని రాజకీయ, క్రీడా ప్రముఖులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. సచిన్ రిటైర్మెంట్ రోజునే అతనికి భారతరత్న అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సచిన్ అభిమానుల కోరిక ఫలించిన వేళ!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానుల కోరిక ఫలించింది. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్‌కు 'భారతరత్న' ఇవ్వాలని ఎంతో కాలంగా వారు డిమాండ్ చేస్తున్నారు. సచిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కొన్ని గంటలు కూడా గడవలేదు. అభిమానులు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. అంతలోనే సచిన్‌కు, అభిమానులకు ఓ శుభవార్త. వారి కళ్లలో ఆనందం. క్రికెట్లో భారతదేశ కీర్తిని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన సచిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజునే ప్రభుత్వం దేశ అత్యున్న పౌరపురస్కారం భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ లేఖ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి సచిన్ స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడింది. ప్రపంచ క్రీడారంగంలో భారత బ్రాండ్ అంబాసిడర్ సచినే అని ఆ లేఖలో పేర్కొంది. క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్న లిటిల్ మాస్టర్ 'భారతరత్న' అందుకోవడంలో కూడా రికార్డు సృష్టించాడు. భారతరత్న అందుకోనున్న అతి చిన్న వయస్కుడు(40) సచిన్. ఈ అత్యున్నత పురస్కారం అందుకోనున్న తొలి క్రీడాకారుడిగా కూడా చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే అధ్యాయం అతనిది. దేశ అత్యున్నత పురస్కారం తనకు ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి సచిన్ ధన్యవాదాలు తెలిపారు. భారతరత్న తనకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ అత్యున్నత అవార్డుకు అన్ని రంగాలవాళ్లూ అర్హులని ప్రభుత్వం ప్రకటించగానే క్రీడల నుంచి హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌తో పాటు సచిన్ టెండూల్కర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సాధారణ అభిమాని నుంచి క్రీడల మంత్రి వరకూ అంతా సచిన్‌కే ఓటేశారు. అయితే గత రెండేళ్లుగా ఈ అత్యున్నత అవార్డును ఎవరికీ ప్రకటించలేదు. సచిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజే ప్రకటించిన ఈ అవార్డును తన తల్లి రజనీ టెండూల్కర్‌కు అంకితమిస్తున్నట్లు సచిన్ చెప్పాడు. రమేశ్ టెండూల్కర్, రజని దంపతులకు 1973 ఏప్రిల్ 24న ముంబైలో జన్మించిన సచిన్ భారత క్రికెట్‌కు 24 ఏళ్ల పాటు సేవలు అందించాడు. లెక్కకుమిక్కిలి రికార్డులు నెలకొల్పాడు. రెండు వందల టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా - అంతర్జాతీయ కెరీర్లో వంద సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా - టెస్టు, వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా లిటిల్ మాస్టర్ చరిత్ర సృష్టించాడు. . క్రికెట్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన సచిన్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. 1999లో పద్మశ్రీ, 1998లో క్రీడల్లో అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌ఖేల్‌రత్న, 1994లో అర్జున అవార్డు, 2008లో పద్మవిభూషణ్‌లను మాస్టర్ అందుకున్నాడు. ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపిక చేసింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం కూడా దక్కించుకొని క్రీడారంగంలో ఎవరికీ అందనంత ఎత్తులో సచిన్ నిలిచాడు. -
క్రికెట్ దేవుడికి భారతరత్న
-
సచిన్‌కు భారతరత్న
-
సచిన్, సిఎన్ఆర్ రావులకు భారతరత్న
భారత క్రికెట్ కు విశేష సేవలు అందించిన సచిన్ టెండూల్కర్‌కు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ప్రకటించింది. సచిన్ తోపాటు సైన్స్‌లో విశేష సేవలు అందించిన ప్రధాని సాంకేతిక సలహాదారుడు సిఎన్ఆర్ రావుకు కూడా భారత తర్న ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం శనివారం ప్రకటించింది. ఇదే రోజు కెరీర్‌కు వీడ్కోలు పలికిన మాస్టర్‌కు పురస్కారం ప్రకటించడం విశేషం. భారత క్రీడా చరిత్రలో అత్యున్నత పౌరపురస్కారం అందుకోనున్న తొలి క్రీడాకారుడిగా సచిన్ ఘనత సాధించనున్నాడు. ఈ అవార్డుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడు కూడా మాస్టరే (40) కావడం విశేషం. భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించినందుకుగాను ఈ అవార్డును బహూకరించనున్నారు. మాస్టర్‌కు భారతరత్న ఇవ్వాలని పలువురు రాజకీయ నాయకులు, వివిధ రంగాల వ్యక్తులు రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. మొదట హాకీ దిగ్గజం ధ్యాన్చంద్కే ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేసినా సచిన్‌నే వరించింది. సచిన్ రిటైర్మెంట్ రోజునే అవార్డు ప్రకటన వెలువడంతో అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముంబైలో రమేశ్ టెండూల్కర్, రజని దంపతులకు జన్మించిన సచిన్ భారత క్రికెట్‌కు 24 ఏళ్ల పాటు సేవలు అందించాడు. లెక్కకుమిక్కిలి రికార్డులు నెలకొల్పాడు. రెండు వందల టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా, అంతర్జాతీయ కెరీర్లో వంద సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా మాస్టర్ చరిత్ర సృష్టించాడు. టెస్టు, వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ కూడా సచినే కావడం విశేషం. సచిన్ గౌరవార్థం ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది.