
'ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందే'
హైదరాబాద్: నేడు దివంగత సీఎం, నటుడు ఎన్టీఆర్ 92 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఆయన కుటుంబం నివాళులర్పించింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాప్తిచేసింది ఎన్టీఆర్ అని ఆయన కుమారుడు, నటుడు హరికృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తెలుగువారందరి తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా కలిసిమెలిసి ఉండాలన్నదే ఎన్టీఆర్ ఆశయమని, కలిసికట్టుగా లక్ష్యాలను సాధించుకోవాలని హరికృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పురందేశ్వరీ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు. వీరితో పాటు దర్శకుడు వైవీఎస్ చౌదరి, ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.