సైమా అవార్డ్స్- 2023 ఉత్తమ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. RRR సినిమాలో తన అద్భుత నటనకు గాను ఈ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. నామినేషన్ లిస్ట్‌లో రామ్ చరణ్ ఉన్నా అవార్డు మాత్రం కొమురం భీం పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్‌కే దక్కింది. 2016లో జనతా గ్యారేజ్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆయన మొదటిసారి ఈ అవార్డును అందకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. 'కొమురం భీముడో... కొమురం భీముడో' పాటలో ఆయన అభినయం ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది.
(ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!)
ఇక, ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్సులో ఎన్టీఆర్ ఎంట్రీ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు మెచ్చకోని ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాషాల్లో కూడా ఆడియన్స్ ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. బీభత్సం, రౌద్రం, ప్రేమ, కరుణ ఒకే పాత్రలో చూపించి దేశం మొత్తం తనవైపు తిప్పుకున్నాడు.
సినిమాల్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా జరిగింది
1983 మే 20న జన్మించిన తారక్ ఓ రోజు మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుండగా తన తాత గారు అయిన సీనియర్ ఎన్టీఆర్‌ను చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఒక మేకప్‌మ్యాన్‌ను పిలిచి తారక్‌కు మేకప్ వేయమని చెప్పారు. మేకప్ పూర్తి అయిన తర్వాత తారక్‌ను చూసిన ఎన్టీఆర్ ఎంతో సంబరపడిపోయారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమను దున్నేస్తావ్ అని కితాబు ఇచ్చారు.
మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్‌కు తెలిపారు. అలా తాత దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత రామాయణం చిత్రంలో తారక్ నటించారు. అప్పటికి ఆయన హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో చదువుతుండేవారు. సినిమాల వల్ల చదువుని అశ్రద్ధ చేస్తాడేమోనని కొద్దిరోజుల పాటు కుటుంబ సభ్యులు సినిమాల జోలికి వెళ్లనివ్వలేదు.
ఎన్టీఆర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది
ఎన్టీఆర్‌కు మొదట పెట్టిన పేరు 'తారక్ రామ్'. కానీ తన తాత సూచనతో నందమూరి తారక రామారావుగా మారాడు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తారక్ ఇలా చెప్పారు. 'ఓ రోజు తాత గారి నుంచి నుంచి కబురు వచ్చింది. అప్పట్లో ఆయన అబిడ్స్‌లో ఉండే వారు. ఆయన్ను కలిసేందుకు వెళ్లగానే.. 'లోపలికి రండి' అంటూ తాత నుంచి గంభీరమైన స్వరంతో ఆహ్వానం.
నేను ఆయన ముందుకు వెళ్లగానే.. పేరేంటి..? అని ఆయన అడగ్గా.. తారక్ అని చెప్పాను. దీంతో వెంటనే, హరికృష్ణ గారిని పిలిచి 'నందమూరి తారక రామారావు' అని పేరు మార్చమని చెప్పారు. ఆ క్షణం నుంచి నేను తాత చేయి వదల్లేదు. ఆయనా నన్ను వదిలి ఉండేవారు కాదు.' అని ఓ సందర్భంలో తాతతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నాడు.
ఎన్టీఆర్‌కు 'అమ్మ' బలమైతే.. 'నాన్న' ప్రాణం
హరికృష్ణ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయనకు శాలిని గారితోనే (జూ. ఎన్టీఆర్ అమ్మ) ఎక్కువ అనుబంధం ఉంది. హైదరాబాద్‌లోనే తన బాల్యం అంతా గడిచింది. బాల్యంలో బాగా అల్లరితో పాటు స్నేహితులతో క్రికెట్, సినిమాలు, షికార్లు, గొడవలు ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తుండటంతో ఒకసారి బాగా విసిగిపోయిన వారి తల్లిగారు శాలిని హ్యాంగర్‌తో కొట్టారని ఓ ఇంటర్వ్యూలో తారక్ చెప్పుకొచ్చారు.
'నేనంటే అమ్మకు ఎంతో ప్రాణం.. ఆమెకు సర్వసం నేనే.. అలాగని ఎప్పుడూ గారాబం చేసేది కాదు. జీవితంలో వాస్తవంలో మాత్రమే బతకాలని నాకు అమ్మే నేర్పింది. నేను ఎప్పుడైనా నిరుత్సాహ పడితే నాలో ఆత్మవిశ్వాసం నింపేది ఆమ్మే. నా జీవితంలో ఆమె నా బలం, బలగం.' అని ఎన్టీఆర్ తెలిపారు. ప్రాణంగా భావించే తన నాన్న హరికృష్ణను రోడ్డు ప్రమాదంలో కోల్పోయినప్పుడు ఆయన ఎంతలా కన్నీరు పెట్టుకున్నాడో అందరం చూశాం. హరికృష్ణ చనిపోయేవరకు ఆయన ఒకే దృక్పథంతో బతికారని గతంలో జూ. ఎన్టీఆర్ చెప్పారు.
అంతేకాకుండా ఆయనలా బతకడం చాలా కష్టం అని కూడా తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోవడంతో ... ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, తమ కోసం కుటుంబం వేచి చూస్తుందని తన ప్రతి సినిమా వేడుకకు హాజరయ్యే అభిమానులకు తారక్ విజ్ఞప్తి చేస్తుంటారు. అభిమానులే తన కుటుంబ సభ్యులని, వారే తన బలగం అని ఆయన పలుమార్లు బహిరంగంగానే చెప్పారు.
తారక్ జీవితంలో ఇవన్నీ ఎవర్‌గ్రీన్
♦ తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
♦ పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు.
♦ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.
♦ యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు.
♦ తారక్ బాల్యంలోనే ప్రఖ్యాత కళాకారుల దగ్గర కూచిపూడి నేర్చుకుని పలు వేదికలపై ప్రదర్శనలూ ఇచ్చారు.
♦ 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.
♦ ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో నటించగా.. జై లవ కుశలో త్రిపాత్రాభినయం చేశారు.
♦ పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
♦ జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్‌షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.
♦ నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు.
♦ మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం.
♦ 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు.
♦ సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు.
♦ తారక్‌కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట
♦ తన సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ప్రేమ.
♦ తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment