సచిన్ అభిమానుల కోరిక ఫలించిన వేళ!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానుల కోరిక ఫలించింది. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్కు 'భారతరత్న' ఇవ్వాలని ఎంతో కాలంగా వారు డిమాండ్ చేస్తున్నారు. సచిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కొన్ని గంటలు కూడా గడవలేదు. అభిమానులు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. అంతలోనే సచిన్కు, అభిమానులకు ఓ శుభవార్త. వారి కళ్లలో ఆనందం. క్రికెట్లో భారతదేశ కీర్తిని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన సచిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజునే ప్రభుత్వం దేశ అత్యున్న పౌరపురస్కారం భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ లేఖ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి సచిన్ స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడింది. ప్రపంచ క్రీడారంగంలో భారత బ్రాండ్ అంబాసిడర్ సచినే అని ఆ లేఖలో పేర్కొంది. క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్న లిటిల్ మాస్టర్ 'భారతరత్న' అందుకోవడంలో కూడా రికార్డు సృష్టించాడు. భారతరత్న అందుకోనున్న అతి చిన్న వయస్కుడు(40) సచిన్. ఈ అత్యున్నత పురస్కారం అందుకోనున్న తొలి క్రీడాకారుడిగా కూడా చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే అధ్యాయం అతనిది. దేశ అత్యున్నత పురస్కారం తనకు ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి సచిన్ ధన్యవాదాలు తెలిపారు. భారతరత్న తనకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఈ అత్యున్నత అవార్డుకు అన్ని రంగాలవాళ్లూ అర్హులని ప్రభుత్వం ప్రకటించగానే క్రీడల నుంచి హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌తో పాటు సచిన్ టెండూల్కర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సాధారణ అభిమాని నుంచి క్రీడల మంత్రి వరకూ అంతా సచిన్‌కే ఓటేశారు. అయితే గత రెండేళ్లుగా ఈ అత్యున్నత అవార్డును ఎవరికీ ప్రకటించలేదు. సచిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజే ప్రకటించిన ఈ అవార్డును తన తల్లి రజనీ టెండూల్కర్‌కు అంకితమిస్తున్నట్లు సచిన్ చెప్పాడు.
రమేశ్ టెండూల్కర్, రజని దంపతులకు 1973 ఏప్రిల్ 24న ముంబైలో జన్మించిన సచిన్ భారత క్రికెట్కు 24 ఏళ్ల పాటు సేవలు అందించాడు. లెక్కకుమిక్కిలి రికార్డులు నెలకొల్పాడు. రెండు వందల టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా - అంతర్జాతీయ కెరీర్లో వంద సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా - టెస్టు, వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా లిటిల్ మాస్టర్ చరిత్ర సృష్టించాడు. .
క్రికెట్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన సచిన్ ఎన్నో అవార్డులు అందుకున్నారు.
1999లో పద్మశ్రీ, 1998లో క్రీడల్లో అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌ఖేల్‌రత్న, 1994లో అర్జున అవార్డు, 2008లో పద్మవిభూషణ్‌లను మాస్టర్ అందుకున్నాడు. ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపిక చేసింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం కూడా దక్కించుకొని క్రీడారంగంలో ఎవరికీ అందనంత ఎత్తులో సచిన్ నిలిచాడు.