ఫతుల్లా: ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్ లో జరిగిన తొలి ట్వంటీ 20లో అఫ్ఘానిస్తాన్ కు యూఏఈ షాకిచ్చింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన యూఏఈ... అఫ్ఘాన్ పై 16 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. తొలుత టాస్ గెలిచిన యూఏఈ నిర్ణీత 20.0 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు నమోదు చేశారు. యూఏఈ ఓపెనర్లు రోహన్ ముస్తాఫా(77), మహ్మద్ కలీమ్(25)లు తొలి వికెట్ కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు.. అనంతరం షమాన్ అన్వర్(11), జావెద్(4)లు నిరాశపరిచినా, ఉస్మాన్ ముస్తాక్(23 నాటౌట్), షహజాద్(25 నాటౌట్)లు సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో యూఏఈ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది.
ఆపై 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన అఫ్ఘాన్ 19.5 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. అఫ్ఘాన్ ఆటగాళ్లలో కరీమ్ సిద్ధిఖ్(72) హాఫ్ సెంచరీ మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. యూఏఈ బౌలర్లలో రోహన్ ముస్తాఫా మూడు వికెట్లతో రాణించగా, మహ్మద్ నవీద్, ఫర్హాన్ అహ్మద్ లు తలో రెండు వికెట్లు తీశారు.