
తన బాధను దిగమింగి...
సావో పాలో: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో చేసిన మ్యాజిక్‌తో ఉరుగ్వే స్టార్ స్వారెజ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. కానీ అతడి విజయం వెనుక ఓ శక్తి ఉంది. ఓ వ్యక్తి తన బాధను దిగమింగి దేశం కోసం పడిన తాపత్రయం ఉంది. ఆ శక్తి పేరు వాల్టర్ ఫెరీరా. ఉరుగ్వే ఫుట్‌బాల్ జట్టు ఫిజియో. మే 22న స్వారెజ్ మోకాలికి ఆపరేషన్ జరిగాక.. ఫెరీరా ప్రతిరోజూ స్వారెజ్ ఇంటికి వెళ్లి చికిత్స అందించారు. చికిత్సతో పాటు తనలో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు. దీంతో ఈ స్టార్ ఆటగాడు 28 రోజుల్లోనే మైదానంలోకి దిగాడు.
ఇదంతా ఒక ఎత్తయితే... 62 ఏళ్ల ఫెరీరా క్యాన్సర్ బాధితుడు. తాను కీమోథెర ఫీ చికిత్స తీసుకుంటూనే స్వారెజ్‌కు చికిత్స చేశారు. ప్రపంచకప్‌కు 21 రోజుల ముందు కూడా ఫెరీరా కీమోథెరఫీ చేయించుకున్నారు. అయినా ఆయన తన బాధను లెక్కచేయకుండా... దేశానికి అత్యంత విలువైన ఆటగాడిని ప్రపంచకప్‌కు సిద్ధం చేయడమనే లక్ష్యంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం దక్కింది. అందుకే రెండో గోల్ చేయగానే స్వారెజ్ పరుగున ఫెరీరా దగ్గరకు వెళ్లాడు. ఆయనను హత్తుకుని క్రెడిట్ ఆయనదేనంటూ ప్రేక్షకులకు చూపించాడు. హ్యాట్సాప్ ఫెరీరా.