రెండు జట్లూ ఇప్పటికే నాకౌట్‌కు చేరాయి. ఇక మ్యాచ్ గ్రూప్ ‘ఎ’లో టాపర్ ఫలితం కోసమే. ఇందులో కీలక ఆటగాళ్లు గాజిన్ స్కీ, చెరిషెవ్‌ల తప్పిదాలతో ఆతిథ్య రష్యా దెబ్బతినగా... స్టార్ ఆటగాడు సురెజ్ జోరుతో ఉరుగ్వే ‘తీన్’మార్ మోగించింది. లీగ్ దశను అజేయంగా ముగించింది. మ్యాచ్‌లో ఓ సెల్ఫ్ గోల్, ఓ రెడ్ కార్డ్ నమోదవడం కొంత ఆసక్తి రేపింది.
సమారా: తొలి రెండు మ్యాచ్‌ల్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్‌లను ఓడించిన రష్యా... బలమైన ఉరుగ్వే ముందు తలొంచింది. ప్రపంచ కప్‌లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 0–3 తేడాతో పరాజయం పాలైంది. ఉరుగ్వేకు లూయీ సురెజ్ (10వ నిమిషం)తో పాటు ఎడిన్సన్ కవానీ (90వ నిమిషం) గోల్స్ అందించగా, రష్యా ఆటగాడు చెరిషెవ్ (23వ నిమిషం) సెల్ఫ్ గోల్‌తో ప్రత్యర్థి పనిని మరింత సులువు చేశాడు. ఉరుగ్వే నాకౌట్‌లో ఈ నెల 30న గ్రూప్ ‘బి’ రన్నరప్‌తో, రష్యా జూలై 1న గ్రూప్ ‘బి’ టాపర్‌తో తలపడతాయి. రష్యా ఆటగాడు స్మొల్నికవ్ (27వ, 36వ నిమిషంలో ఎల్లో కార్డ్) రెడ్ కార్డ్‌ను ఎదుర్కొని తదుపరి మ్యాచ్‌కు దూరమయ్యాడు.
కీలక ఆటగాళ్ల తప్పిదాలతో
సొంతగడ్డ అనుకూలతతో కప్‌లో రాణిస్తున్న రష్యాకు ఈ మ్యాచ్‌లో ఏదీ కలిసిరాలేదు. కీలక ఆటగాళ్లు ల్యూరీ గాజిన్ స్కీ, చెరిషెవ్‌ల పొరపాట్లు ప్రత్యర్థికి అనుకోని వరంలా మారాయి. పెనాల్టీ ఏరియా ముందు గాజిన్ స్కీ ఫౌల్ చేయడంతో ఉరుగ్వేకు 10వ నిమిషంలోనే ఫ్రీ కిక్ లభించింది. కీపర్ అకిన్‌ఫీవ్‌ను తప్పిస్తూ దీనిని సురెజ్ తెలివిగా తక్కువ ఎత్తులోనే గోల్‌పోస్ట్‌లోకి పంపి జట్టుకు ఆధిక్యం అందించాడు. రష్యాకు కూడా వెంటనే కార్నర్ కిక్ రూపంలో ఓ అవకాశం దక్కింది. దానిని డియుబా తలతో గోల్ పోస్ట్‌లోకి నెట్టే యత్నం చేసినా దూరంగా వెళ్లింది. టోర్నీలో రెండు మ్యాచ్‌ల్లో మూడు గోల్స్‌తో హీరోగా నిలిచిన చెరిషెవ్... 23వ నిమిషంలో మరో పెద్ద పొరపాటు చేశాడు. డిగో లక్సాల్ట్ (ఉరుగ్వే) షాట్‌ను తప్పించే యత్నంలో గురితప్పి అతడు అనూహ్యంగా సెల్ఫ్ గోల్ చేశాడు. ఓవైపు ఉరుగ్వే దూకుడుగా దాడులు చేస్తుండగా... స్మొల్నికవ్ 9 నిమిషాల వ్యవధిలో రెండు ఎల్లో కార్డ్‌లకు గురై మైదానాన్ని వీడాడు. దీంతో రష్యా 10 మందితోనే ఆడాల్సి వచ్చింది.
పట్టు జారకుండా...
2–0తో సురక్షిత స్థితిలో ఉండటంతో ఉరుగ్వే ప్రశాంతంగా ఆడుతూ రెండో భాగంలో పట్టుజారకుండా చూసుకుంది. 90వ నిమిషంలో డిఫెండర్ డీగో గొడిన్ నుంచి అందిన బంతిని కవాని పొరపాటు లేకుండా గోల్‌గా మలిచాడు.
సౌదీ... చివరకు గెలిచింది
వోల్గోగ్రాడ్: సౌదీ అరేబియా విజయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ ‘ఎ’లో సోమవారం ఆఖరి మ్యాచ్‌లో సౌదీ జట్టు 2–1తో ఈజిప్ట్‌పై గెలిచింది. ఈ ప్రపంచకప్‌లోనే అతిపెద్ద వయస్కుడైన 45 ఏళ్ల ఈజిప్ట్ గోల్‌కీపర్ ఎసామ్ ప్రత్యర్థి పెనాల్టీ కిక్‌ను అడ్డుకోవడం అకట్టుకుంది. 22వ నిమిషంలో ఈజిప్ట్ మిడ్‌ఫీల్డర్ సలాæ గోల్ చేయడంతో 1–0 ఆధిక్యం లోకి వెళ్లింది. 39వ నిమిషంలో మువల్లాద్ పెనాల్టీ కిక్‌ను ఎసామ్ అడ్డుకున్నాడు. కానీ నిమిషాల వ్యవధిలోనే మరో పెనాల్టీని పొందిన సౌదీ అరేబియాకు ఈ సారి సల్మాన్ ఇంజ్యూరీ టైమ్(45+6వ ని)లో గోల్ సాధించి పెట్టాడు. చివర్లో సలీమ్ కూడా ఇంజ్యూరీ టైమ్ (90+5వ ని.)లో గోల్ చేసి సౌదీని గెలిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment