కెర్బర్... నంబర్ 1 | US Open: Angelique Kerber says becoming number one 'sounds amazing' | Sakshi
Sakshi News home page

కెర్బర్... నంబర్ 1

Published Sat, Sep 10 2016 2:53 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

కెర్బర్... నంబర్ 1

కెర్బర్... నంబర్ 1

ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాక... ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోవడంతో ఆమెను ‘వన్ హిట్ వండర్’ అని టెన్నిస్ పండితులు అభివర్ణించారు. కానీ ఆ అమ్మాయి మాత్రం అలా భావించలేదు. తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకొని వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది. ఆ తర్వాత అదే జోరును సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో కొనసాగించింది. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకుంది.

నిలకడగా ఆడుతూ అందరి అంచనాలను తారుమారు చేసిన ఆ జర్మనీ అమ్మాయి పేరు ఎంజెలిక్ కెర్బర్. కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరిన కెర్బర్ ఫైనల్లో చెక్ రిపబ్లిక్ అమ్మాయి కరోలినా ప్లిస్కోవాతో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్‌లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించిన ప్లిస్కోవా ఫైనల్లో ఏం చేస్తుందో వేచి చూడాలి. ఫైనల్లో ఎవరు గెలిచినా తొలిసారి యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరిస్తారు.

 
* యూఎస్ ఓపెన్‌లో ఫైనల్లోకి  
* తొలిసారి టాప్ ర్యాంక్ సొంతం
* సెమీస్‌లో వొజ్నియాకిపై గెలుపు
* సెరెనాకు ప్లిస్కోవా షాక్  
* నేడు కెర్బర్‌తో టైటిల్ పోరు  


న్యూయార్క్: గత ఏడాది మాదిరిగానే ఈసారీ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో కెర్బర్ 6-4, 6-3తో రెండు సార్లు రన్నరప్, మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై గెలుపొందగా... ప్లిస్కోవా 6-2, 7-6 (7/5)తో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది.

ప్లిస్కోవాకిది తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కాగా, కెర్బర్‌కు మూడోది. ముఖాముఖి రికార్డులో కెర్బర్ 4-3తో ఆధిక్యంలో ఉంది. కెర్బర్ ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించి, వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. గతేడాది ఇటలీకి చెందిన ఫ్లావియా పెనెట్టా, రొబెర్టా విన్సీ తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరగా... పెనెట్టా టైటిల్ సాధించాక టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది.  
 
సెరెనా చేజారిన రికార్డు
మరో సెమీస్‌లో సెరెనా ఓడిపోవడం, కెర్బర్ ఫైనల్‌కు చేరుకోవడంతో... అంతిమ సమరం ఫలితంతో సంబంధం లేకుండా సోమవారం మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) విడుదల చేసే తాజా ప్రపంచ ర్యాంకింగ్‌‌సలో కెర్బర్ కొత్త నంబర్‌వన్ ప్లేయర్‌గా ఆవిర్భవించనుంది. ఒకవేళ సెరెనా ఫైనల్‌కు చేరుకున్నా కచ్చితంగా టైటిల్ గెలిస్తేనే ఆమె నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకునేది. సెమీస్‌లో సెరెనా ఓటమితో వరుసగా 187 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశాన్ని ఈ అమెరికా స్టార్ కోల్పోరుుంది. వరుసగా 186 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన స్టెఫీ గ్రాఫ్ రికార్డును సెరెనా సమం చేయగలిగింది కానీ అధిగమించలేకపోయింది.
 
అదే జోరు...
సెమీస్ చేరే వరకు ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా ఇవ్వని కెర్బర్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఆరంభంలో రెండుసార్లు వొజ్నియాకి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ జర్మన్ స్టార్ 15 నిమిషాల్లోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత వొజ్నియాకి ఒక బ్రేక్ పారుుంట్ సంపాదించి కోలుకునేందకు ప్రయత్నించినా కెర్బర్ తన సర్వీస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ మొదట్లోనే వొజ్నియాకి సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో కెర్బర్ నెట్ వద్దకు ఎనిమిదిసార్లు దూసుకొచ్చి ఏడుసార్లు పారుుంట్లు సాధించింది. 19 విన్నర్స్ కొట్టిన ఆమె 16 అనవసర తప్పిదాలు చేసింది. సర్వీస్‌లో తడబడిన వొజ్నియాకి 26 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘నా కెరీర్‌లో ఈ రోజు గొప్ప దినం. ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకోవడం గొప్పగా అనిపిస్తోంది’ అని కెర్బర్ వ్యాఖ్యానించింది.
 
మహిళల సింగిల్స్ ఫైనల్
నేటి అర్ధరాత్రి గం. 1.30 నుంచి టెన్-1లో ప్రత్యక్షప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement