Womens Singles Final
-
Wimbledon Tennis tournament: ‘క్వీన్’ రిబాకినా
లండన్: కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడికి తలొగ్గకుండా... తొలి సెట్ కోల్పోయినా ఆందోళన చెందకుండా... ఆద్యంతం పట్టుదలతో పోరాడిన కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా తన ‘గ్రాండ్’కలను సాకారం చేసుకుంది. శనివారం జరిగిన వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల రిబాకినా చాంపియన్‌గా అవతరించింది. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ రిబాకినా 3–6, 6–2, 6–2తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్స్ జబర్‌ను ఓడించింది. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన తొలి కజకిస్తాన్ ప్లేయర్‌గా రిబాకినా చరిత్ర సృష్టించింది. విజేతగా నిలిచిన రిబాకినాకు 20 లక్షల బ్రిటిష్ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు), రన్నరప్ జబర్‌కు 10 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 10 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. తడబడి... నిలబడి ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జబర్ ఫైనల్లోనూ జోరు కొనసాగించింది. వైవిధ్యభరిత డ్రాప్ షాట్లు, పాసింగ్ షాట్లతో చెలరేగిన జబర్ మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసి 32 నిమిషాల్లో సెట్‌ను దక్కించుకుంది. తొలి సెట్ కోల్పోయినా రిబాకినా పట్టుదల కోల్పోలేదు. రెండో సెట్లోని తొలి గేమ్‌లోనే జబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబాకినా అదే జోరులో ఐదో గేమ్‌లోనూ బ్రేక్ సాధించి 4–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శక్తివంతమైన సర్వీస్‌లు, ఫోర్‌హ్యాండ్ షాట్లతో విజృంభించిన రిబాకినా 39 నిమిషాల్లో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోని తొలి గేమ్‌లో మళ్లీ జబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబాకినా... ఆ తర్వాత ఏడో గేమ్‌లో మరోసారి జబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఎనిమిదో గేమ్‌లో రిబాకినా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. నేడు జొకోవిచ్ (సెర్బియా), కిరియోస్ (ఆస్ట్రేలియా) మధ్య పురుషుల సింగిల్స్ ఫైనల్ జరుగుతుంది. ఫైనల్ గణాంకాలు రిబాకినా ఆన్స్ జబర్ 4 ఏస్‌లు 4 3 డబుల్‌ఫాల్ట్‌లు 1 17/36 నెట్ పాయింట్లు 7/14 4/6 బ్రేక్ పాయింట్లు 2/11 29 విన్నర్స్ 17 33 అనవసర తప్పిదాలు 24 86 మొత్తం పాయింట్లు 80 -
ఎవరు గెలిచిన చరిత్రే
►హలెప్ & ఒస్టాపెంకో ►నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ ►ఫేవరెట్‌గా హలెప్ పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో శనివారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ప్రపంచ నాలుగోర్యాంకర్, మూడోసీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)తో అన్‌సీడేడ్ ఎలీనా ఒస్టాపెంకో (లాత్వియా) తలపడనుంది. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్, రెండోసీడ్ కరోలిన్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై సంచలన విజయం సాధించిన హలెప్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. నెగ్గితే టాప్ ర్యాంకుకు హలెప్.. మహిళల సింగిల్స్‌లో నం.1 ప్లేయర్, ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తొలిరౌండ్లోనే వెనుదిరగడంతో టాప్ ప్లేస్ దక్కించుకునేందుకు ప్లిస్కోవా, హలెప్లకు మంచి అవకాశం దక్కింది. మరోవైపు ప్రపంచ నం.2 సెరెనా విలియమ్స్ (అమెరికా) ప్రస్తుతం గర్భవతిగా ఉండడంతో మరో ఏడాది వరకు ఆమె బరిలోకి దిగే చాన్స్ లేదు. దీంతో ప్లిస్కోవా ఈ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశిస్తే టాప్ ర్యాంకు సొంతమయ్యేది. అయితే గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ప్లిస్కోవా 4–6, 6–3, 3–6తో హలెప్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీ ఫైనల్లోకి చేరిన హలెప్ మరో విజయం సాధిస్తే చాలు టాప్ ర్యాంకును కైవసం చేసుకుంటుంది. క్వార్టర్స్ వరకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ప్రయాణం కొనసాగించిన రొమేనియన్ ప్లేయర్‌కు ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)తో జరిగిన మ్యాచ్ కఠినంగా సాగింది. దాదాపు మ్యాచ్ పాయింట్‌ను కాచుకుని ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. సెమీస్ మ్యాచ్‌లో కూడా విజయం అంత సులువుగా దక్కలేదు. మరోవైపు 2014లో ఈ టోర్నీ ఫైనల్‌కు చేరిన హలెప్.. మరియా షరపోవా (రష్యా) చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి ఎలాగైనా తొలి గ్రాండ్‌స్లామ్ కైవసం చేసుకోవాలని హలెప్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఓసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడి ఉండడం హలెప్‌కు ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. తొలిసారి ఫైనల్‌కు.. మరోవైపు 2015 నుంచి గ్రాండ్‌స్లామ్‌లలో ఆడుతున్న 20 ఏళ్ల ఒస్టాపెంకో.. గ్రాండ్‌స్లామ్‌లలో మూడో రౌండ్‌కు చేరుకోవడమే అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. అది కూడా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నమోదు చేసినదే. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం అద్వితీయ ఆటతీరు ప్రదర్శించిన ఒస్టాపెంకో.. ఏకంగా గ్రాండ్‌స్లామ్ పైనల్‌కు చేరుకుంది. కెరీర్లో ఒక్క డబ్ల్యూటీఏ టైటిల్లేని ఎలీనా.. 2016 ఖతార్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఇదే ఎలీనా అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పుకోవచు. మరోవైపు సంచలనాలతో ఫైనల్‌కు చేరిన ఒస్టాపెంకో.. ఫైనల్లోనూ విజయం సాధించి ఈ టోర్నీ మధురానుభూతిగా మలుచుకోవాలని భావిస్తోంది. ►మ్యాచ్ సా.6.30 ని.లకు స్టార్‌స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
కెర్బర్... నంబర్ 1
ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాక... ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోవడంతో ఆమెను ‘వన్ హిట్ వండర్’ అని టెన్నిస్ పండితులు అభివర్ణించారు. కానీ ఆ అమ్మాయి మాత్రం అలా భావించలేదు. తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకొని వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది. ఆ తర్వాత అదే జోరును సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో కొనసాగించింది. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకుంది. నిలకడగా ఆడుతూ అందరి అంచనాలను తారుమారు చేసిన ఆ జర్మనీ అమ్మాయి పేరు ఎంజెలిక్ కెర్బర్. కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరిన కెర్బర్ ఫైనల్లో చెక్ రిపబ్లిక్ అమ్మాయి కరోలినా ప్లిస్కోవాతో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్‌లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించిన ప్లిస్కోవా ఫైనల్లో ఏం చేస్తుందో వేచి చూడాలి. ఫైనల్లో ఎవరు గెలిచినా తొలిసారి యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరిస్తారు. * యూఎస్ ఓపెన్‌లో ఫైనల్లోకి * తొలిసారి టాప్ ర్యాంక్ సొంతం * సెమీస్‌లో వొజ్నియాకిపై గెలుపు * సెరెనాకు ప్లిస్కోవా షాక్ * నేడు కెర్బర్తో టైటిల్ పోరు న్యూయార్క్: గత ఏడాది మాదిరిగానే ఈసారీ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో కెర్బర్ 6-4, 6-3తో రెండు సార్లు రన్నరప్, మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై గెలుపొందగా... ప్లిస్కోవా 6-2, 7-6 (7/5)తో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది. ప్లిస్కోవాకిది తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కాగా, కెర్బర్‌కు మూడోది. ముఖాముఖి రికార్డులో కెర్బర్ 4-3తో ఆధిక్యంలో ఉంది. కెర్బర్ ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించి, వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. గతేడాది ఇటలీకి చెందిన ఫ్లావియా పెనెట్టా, రొబెర్టా విన్సీ తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరగా... పెనెట్టా టైటిల్ సాధించాక టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. సెరెనా చేజారిన రికార్డు మరో సెమీస్‌లో సెరెనా ఓడిపోవడం, కెర్బర్ ఫైనల్‌కు చేరుకోవడంతో... అంతిమ సమరం ఫలితంతో సంబంధం లేకుండా సోమవారం మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) విడుదల చేసే తాజా ప్రపంచ ర్యాంకింగ్‌సలో కెర్బర్ కొత్త నంబర్‌వన్ ప్లేయర్‌గా ఆవిర్భవించనుంది. ఒకవేళ సెరెనా ఫైనల్‌కు చేరుకున్నా కచ్చితంగా టైటిల్ గెలిస్తేనే ఆమె నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకునేది. సెమీస్‌లో సెరెనా ఓటమితో వరుసగా 187 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశాన్ని ఈ అమెరికా స్టార్ కోల్పోరుుంది. వరుసగా 186 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన స్టెఫీ గ్రాఫ్ రికార్డును సెరెనా సమం చేయగలిగింది కానీ అధిగమించలేకపోయింది. అదే జోరు... సెమీస్ చేరే వరకు ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా ఇవ్వని కెర్బర్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఆరంభంలో రెండుసార్లు వొజ్నియాకి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ జర్మన్ స్టార్ 15 నిమిషాల్లోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత వొజ్నియాకి ఒక బ్రేక్ పారుుంట్ సంపాదించి కోలుకునేందకు ప్రయత్నించినా కెర్బర్ తన సర్వీస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ మొదట్లోనే వొజ్నియాకి సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో కెర్బర్ నెట్ వద్దకు ఎనిమిదిసార్లు దూసుకొచ్చి ఏడుసార్లు పారుుంట్లు సాధించింది. 19 విన్నర్స్ కొట్టిన ఆమె 16 అనవసర తప్పిదాలు చేసింది. సర్వీస్‌లో తడబడిన వొజ్నియాకి 26 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘నా కెరీర్లో ఈ రోజు గొప్ప దినం. ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకోవడం గొప్పగా అనిపిస్తోంది’ అని కెర్బర్ వ్యాఖ్యానించింది. మహిళల సింగిల్స్ ఫైనల్ నేటి అర్ధరాత్రి గం. 1.30 నుంచి టెన్-1లో ప్రత్యక్షప్రసారం -
స్వర్ణ సింధూరమా.. రజత మందారమా
మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు సెమీస్‌లో ఒకుహారాపై అద్వితీయ విజయం ఖాయమైన పతకం... విశ్వవిజేత మారిన్‌తో నేడు ‘పసిడి’ పోరు భారతమాత పాపిటలో దిద్దిన విజయ సింధూరమిది... కోట్లాది భారతీయుల గుండె గొంతుకను రియోలో ధ్వనింపజేసిన సింధూరనాదమిది... పదహారణాల అచ్చమైన మన తెలుగమ్మాయి సాధించిన అద్భుతమిది... దేశం మొత్తాన్ని ఒక్క చోటికి తెచ్చి జైహింద్ అనిపించిన విజయభేరి ఇది... ఆడుతోంది తొలి ఒలింపిక్స్... వయసు కేవలం 21 ఏళ్లు... కానీ పూసర్ల వెంకట సింధు చరిత్ర సృష్టించింది... ఒలింపిక్స్ ఆరంభంనుంచి ఆఖరు దశకు చేరే వరకు ఎందరో స్టార్లు తలవంచి నిష్ర్కమించిన చోట... సింధు మాత్రం ఉవ్వెత్తున ఎగిసింది. గురువారం తెల్లవారుజామునే కాంస్యంతో సాక్షి మలిక్ మనల్ని పలకరిస్తే... సాయంత్రానికి సింధు తన సూపర్ ఆటతో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. బ్యాడ్మింటన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా రికార్డులకెక్కిన ఈ హైదరాబాదీ అమ్మాయి ఇక గోల్డ్‌పై గురి పెట్టింది. నేడు మారిన్‌తో జరిగే తుది పోరులోనూ విజయం సాధిస్తే భారత క్రీడా పటంపై ఎప్పటికీ చెరిగిపోని హస్తాక్షరంగా సింధు చరిత్రలో అత్యున్నత స్థాయికి చేరుతుంది. ఒక వేళ ఓడినా... వెండి వెలుగులు కొత్త చరిత్రగా నిలిచిపోవడం ఇప్పటికే ఖాయమైపోయింది. రియో డి జనీరో: విశ్వ క్రీడా సంరంభంలో ‘మన రాకెట్’ మెరిసింది. యావత్ దేశం మురిసిపోయేలా చేసింది. కలయా, నిజమా అన్నట్లు సంభ్రమాశ్చర్యంలో ముంచింది. తొలి ఒలింపిక్స్‌లోనే తెలుగు అమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. అంకితభావానికి, పట్టుదలకు నిజమైన రూపం ఎలా ఉంటుందో నిరూపిస్తూ... రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పసిడి పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై ఘనవిజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీకి సిద్ధమైంది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ కరోలినా మారిన్ 21-14, 21-16తో డిఫెండింగ్ చాంపియన్ లీ జురుయ్ (చైనా)పై గెలిచింది. మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 2-4తో వెనుకబడి ఉంది. చివరిసారి సింధు గతేడాది డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో మారిన్‌పై విజయం సాధించడం గమనార్హం. లెక్క సరిచేసింది: ఈ ఏడాది ‘ఆల్ ఇంగ్లండ్ చాంపియన్’ ఒకుహారాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సింధు అత్యున్నతస్థాయి ఆటతీరును కనబరిచింది. ఒకుహారా చేతిలో ఇటీవల ఎదురైన వరుస వుూడు పరాజయాలకు ఈ ఒక్క విజయంతో లెక్క సరిచేసి ప్రతీకారం తీర్చుకుంది. ఒకుహారా ఆటపై మంచి హోంవర్క్ చేసి వచ్చిన సింధు దానిని కోర్టులో అమలు చేసింది. ఆరంభంలోనే 4-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడినా సింధు మాత్రం స్కోరును ఒక్కసారీ సమం కానీయలేదు. కనీసం రెండు లేదా మూడు పాయింట్ల ఆధిక్యంలో ఉంటూ ముందంజ వేసింది. చివరికొచ్చేసరికి ఒకుహారా, సింధు మధ్య తేడా ఒక పాయింట్‌కు వచ్చింది. స్కోరు 20-19 వద్ద ఒకుహారా సంధించిన స్మాష్ నెట్‌కు తగలడంతో తొలి గేమ్ సింధు వశమైంది. దూకుడే దూకుడు: తొలి గేమ్ నెగ్గిన ఉత్సాహంలో సింధు రెండో గేమ్‌లోనూ శుభారంభం చేసింది. 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో సింధు అనవసర తప్పిదాలు చేయడంతో ఒకుహారా తేరుకుంది. స్కోరును 3-3తో సమం చేసింది. ఒకుహారా ఖాతాలో చేరిన పాయింట్లు సింధు పొరపాట్లతోనే వచ్చాయి తప్ప ఒకుహారా విన్నర్స్ ద్వారా రాలేదు. విరామానికి సింధు 11-10తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత సింధు తన విశ్వరూపాన్ని చూపింది. కళ్లు చెదిరే స్మాష్‌లతో ఒకుహారాను హడలెత్తించింది. కోర్టుకిరువైపులా ఆడిస్తూ ఈ జపాన్ ప్లేయర్‌కు చుక్కలు చూపెట్టింది. వరుసగా పది పాయింట్లు సాధించి గేమ్‌ను, మ్యాచ్‌ను 21-10తో సొంతం చేసుకొని చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. నేడే చూడండి రాత్రి 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్ 2, 3లో ప్రత్యక్షప్రసారం -
‘విక్టోరియా’ చాంప్ జోష్నా
మెల్బోర్న్: విక్టోరియా ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్లో భారత స్టార్ జోష్నా చిన్నప్ప విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ జోష్నా 11-5, 11-4, 11-9తో రెండో సీడ్ లైన్ హాన్సెన్ (డెన్మార్క్)ను ఓడించింది. ఈ ఏడాది జోష్నాకిదే తొలి అంతర్జాతీయ టైటిల్. గతేడాది ఏప్రిల్‌లో అమెరికాలో జరిగిన రిచ్మండ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన జోష్నా ఆ తర్వాత ఈ టోర్నీలోనే టైటిల్ సాధించింది. విక్టోరియా ఓపెన్‌లో టైటిల్ సాధించే క్రమంలో ఈ భారత స్టార్ తన ప్రత్యర్థులకు కేవలం ఒక గేమ్‌ను మాత్రమే కోల్పోయింది. అంతేకాకుండా నలుగురు సీడెడ్ క్రీడాకారిణులను ఓడించింది.