స్వర్ణ సింధూరమా.. రజత మందారమా
మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు
సెమీస్‌లో ఒకుహారాపై అద్వితీయ విజయం
ఖాయమైన పతకం... విశ్వవిజేత మారిన్‌తో నేడు ‘పసిడి’ పోరు
భారతమాత పాపిటలో దిద్దిన విజయ సింధూరమిది... కోట్లాది భారతీయుల గుండె గొంతుకను రియోలో ధ్వనింపజేసిన సింధూరనాదమిది... పదహారణాల అచ్చమైన మన తెలుగమ్మాయి సాధించిన అద్భుతమిది... దేశం మొత్తాన్ని ఒక్క చోటికి తెచ్చి జైహింద్ అనిపించిన విజయభేరి ఇది...
ఆడుతోంది తొలి ఒలింపిక్స్... వయసు కేవలం 21 ఏళ్లు... కానీ పూసర్ల వెంకట సింధు చరిత్ర సృష్టించింది... ఒలింపిక్స్ ఆరంభంనుంచి ఆఖరు దశకు చేరే వరకు ఎందరో స్టార్లు తలవంచి నిష్ర్కమించిన చోట... సింధు మాత్రం ఉవ్వెత్తున ఎగిసింది. గురువారం తెల్లవారుజామునే కాంస్యంతో సాక్షి మలిక్ మనల్ని పలకరిస్తే... సాయంత్రానికి సింధు తన సూపర్ ఆటతో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. బ్యాడ్మింటన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా రికార్డులకెక్కిన ఈ హైదరాబాదీ అమ్మాయి ఇక గోల్డ్‌పై గురి పెట్టింది. నేడు మారిన్‌తో జరిగే తుది పోరులోనూ విజయం సాధిస్తే భారత క్రీడా పటంపై ఎప్పటికీ చెరిగిపోని హస్తాక్షరంగా సింధు చరిత్రలో అత్యున్నత స్థాయికి చేరుతుంది. ఒక వేళ ఓడినా... వెండి వెలుగులు కొత్త చరిత్రగా నిలిచిపోవడం ఇప్పటికే ఖాయమైపోయింది.
రియో డి జనీరో: విశ్వ క్రీడా సంరంభంలో ‘మన రాకెట్’ మెరిసింది. యావత్ దేశం మురిసిపోయేలా చేసింది. కలయా, నిజమా అన్నట్లు సంభ్రమాశ్చర్యంలో ముంచింది. తొలి ఒలింపిక్స్‌లోనే తెలుగు అమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. అంకితభావానికి, పట్టుదలకు నిజమైన రూపం ఎలా ఉంటుందో నిరూపిస్తూ... రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పసిడి పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై ఘనవిజయాన్ని నమోదు చేసింది.
శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీకి సిద్ధమైంది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ కరోలినా మారిన్ 21-14, 21-16తో డిఫెండింగ్ చాంపియన్ లీ జురుయ్ (చైనా)పై గెలిచింది. మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 2-4తో వెనుకబడి ఉంది. చివరిసారి సింధు గతేడాది డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో మారిన్‌పై విజయం సాధించడం గమనార్హం.
లెక్క సరిచేసింది: ఈ ఏడాది ‘ఆల్ ఇంగ్లండ్ చాంపియన్’ ఒకుహారాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సింధు అత్యున్నతస్థాయి ఆటతీరును కనబరిచింది. ఒకుహారా చేతిలో ఇటీవల ఎదురైన వరుస వుూడు పరాజయాలకు ఈ ఒక్క విజయంతో లెక్క సరిచేసి ప్రతీకారం తీర్చుకుంది. ఒకుహారా ఆటపై మంచి హోంవర్క్ చేసి వచ్చిన సింధు దానిని కోర్టులో అమలు చేసింది. ఆరంభంలోనే 4-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడినా సింధు మాత్రం స్కోరును ఒక్కసారీ సమం కానీయలేదు. కనీసం రెండు లేదా మూడు పాయింట్ల ఆధిక్యంలో ఉంటూ ముందంజ వేసింది. చివరికొచ్చేసరికి ఒకుహారా, సింధు మధ్య తేడా ఒక పాయింట్‌కు వచ్చింది. స్కోరు 20-19 వద్ద ఒకుహారా సంధించిన స్మాష్ నెట్‌కు తగలడంతో తొలి గేమ్ సింధు వశమైంది.
దూకుడే దూకుడు: తొలి గేమ్ నెగ్గిన ఉత్సాహంలో సింధు రెండో గేమ్‌లోనూ శుభారంభం చేసింది. 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో సింధు అనవసర తప్పిదాలు చేయడంతో ఒకుహారా తేరుకుంది. స్కోరును 3-3తో సమం చేసింది. ఒకుహారా ఖాతాలో చేరిన పాయింట్లు సింధు పొరపాట్లతోనే వచ్చాయి తప్ప ఒకుహారా విన్నర్స్ ద్వారా రాలేదు. విరామానికి సింధు 11-10తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత సింధు తన విశ్వరూపాన్ని చూపింది. కళ్లు చెదిరే స్మాష్‌లతో ఒకుహారాను హడలెత్తించింది. కోర్టుకిరువైపులా ఆడిస్తూ ఈ జపాన్ ప్లేయర్‌కు చుక్కలు చూపెట్టింది. వరుసగా పది పాయింట్లు సాధించి గేమ్‌ను, మ్యాచ్‌ను 21-10తో సొంతం చేసుకొని చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది.
నేడే చూడండి రాత్రి 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్ 2, 3లో ప్రత్యక్షప్రసారం