ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్న సురేంద్ర సింగ్
హైదరాబాద్: పోలీస్ శాఖలో కూడా మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించి, తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆలిండియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) అడిషనల్ డీజీ ధర్మేంద్ర కుమార్ అన్నారు. భవిష్యత్తులో తమ శాఖనుంచి కూడా ఒలింపిక్ రజత పతాక విజేత సింధులాంటి ఆటగాళ్లను తయారు చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 3నుంచి 7 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ఆలిండియా పోలీస్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ సారి పోటీలను సీఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ధర్మేంద్ర కుమార్ పోటీల వివరాలను వెల్లడించారు. ‘పోలీస్ సంస్థల మధ్య సత్సంబంధాలు పెంచడంతో పాటు క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే పోలీస్ శాఖనుంచి మేరీకోమ్, విజేందర్ సింగ్, సమరేశ్ జంగ్‌లాంటి ఆటగాళ్లు ప్రపంచ స్థాయి విజయాలు సాధించి మా శాఖకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టారు. అదే బాటలో మున్ముందు ప్రతిభ గల పోలీసులను గుర్తించి సింధు స్థాయిలో తీర్చిదిద్దడమే మా లక్ష్యం. గతంలో రెండు సార్లు ఈ పోటీలను నిర్వహించిన సీఐఎస్‌ఎఫ్‌కు మళ్లీ అవకాశం దక్కడం సంతోషంగా ఉంది’ అని ఆయన చెప్పారు. చాంపియన్‌షిప్‌లో స్ప్రింట్, త్రోయింగ్ ఈవెంట్లు, జంపింగ్ ఈవెంట్లు కలిపి మొత్తం 44 అంశాల్లో పురుషులు, మహిళలకు పోటీలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ శాఖలకు చెందిన 40 జట్లనుంచి 1000 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొంటున్నారు. 3న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథి కాగా, సింధు కూడా పాల్గొననుంది. ముగింపు ఉత్సవానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. మీడియా సమావేశంలో సీఐఎస్‌ఎఫ్ డీఐజీ ఎంఆర్ నాయక్, ఐజీ జగ్బీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.