ఎవరు గెలిచిన చరిత్రే
►హలెప్ & ఒస్టాపెంకో
►నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్
►ఫేవరెట్‌గా హలెప్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో శనివారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ప్రపంచ నాలుగోర్యాంకర్, మూడోసీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)తో అన్‌సీడేడ్ ఎలీనా ఒస్టాపెంకో (లాత్వియా) తలపడనుంది. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్, రెండోసీడ్ కరోలిన్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై సంచలన విజయం సాధించిన హలెప్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.
నెగ్గితే టాప్ ర్యాంకుకు హలెప్..
మహిళల సింగిల్స్‌లో నం.1 ప్లేయర్, ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తొలిరౌండ్‌లోనే వెనుదిరగడంతో టాప్ ప్లేస్ దక్కించుకునేందుకు ప్లిస్కోవా, హలెప్‌లకు మంచి అవకాశం దక్కింది. మరోవైపు ప్రపంచ నం.2 సెరెనా విలియమ్స్ (అమెరికా) ప్రస్తుతం గర్భవతిగా ఉండడంతో మరో ఏడాది వరకు ఆమె బరిలోకి దిగే చాన్స్ లేదు. దీంతో ప్లిస్కోవా ఈ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశిస్తే టాప్ ర్యాంకు సొంతమయ్యేది. అయితే గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ప్లిస్కోవా 4–6, 6–3, 3–6తో హలెప్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీ ఫైనల్లోకి చేరిన హలెప్ మరో విజయం సాధిస్తే చాలు టాప్ ర్యాంకును కైవసం చేసుకుంటుంది. క్వార్టర్స్ వరకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ప్రయాణం కొనసాగించిన రొమేనియన్ ప్లేయర్‌కు ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)తో జరిగిన మ్యాచ్ కఠినంగా సాగింది. దాదాపు మ్యాచ్ పాయింట్‌ను కాచుకుని ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. సెమీస్ మ్యాచ్‌లో కూడా విజయం అంత సులువుగా దక్కలేదు. మరోవైపు 2014లో ఈ టోర్నీ ఫైనల్‌కు చేరిన హలెప్.. మరియా షరపోవా (రష్యా) చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి ఎలాగైనా తొలి గ్రాండ్‌స్లామ్ కైవసం చేసుకోవాలని హలెప్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఓసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడి ఉండడం హలెప్‌కు ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.
తొలిసారి ఫైనల్‌కు..
మరోవైపు 2015 నుంచి గ్రాండ్‌స్లామ్‌లలో ఆడుతున్న 20 ఏళ్ల ఒస్టాపెంకో.. గ్రాండ్‌స్లామ్‌లలో మూడో రౌండ్‌కు చేరుకోవడమే అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. అది కూడా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నమోదు చేసినదే. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం అద్వితీయ ఆటతీరు ప్రదర్శించిన ఒస్టాపెంకో.. ఏకంగా గ్రాండ్‌స్లామ్ పైనల్‌కు చేరుకుంది. కెరీర్‌లో ఒక్క డబ్ల్యూటీఏ టైటిల్‌లేని ఎలీనా.. 2016 ఖతార్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఇదే ఎలీనా అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పుకోవచు. మరోవైపు సంచలనాలతో ఫైనల్‌కు చేరిన ఒస్టాపెంకో.. ఫైనల్లోనూ విజయం సాధించి ఈ టోర్నీ మధురానుభూతిగా మలుచుకోవాలని భావిస్తోంది.
►మ్యాచ్ సా.6.30 ని.లకు స్టార్‌స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం