ఎల్ మాంటే(యూఎస్):గతవారం కెనడా గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ను సాధించిన భారత షట్లర్ సాయి ప్రణీత్ మరో టైటిల్ ను సాధించే దిశగా సాగుతున్నాడు. ఇక్కడ జరుగుతున్న యూఎస్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రిక్వార్టర్స్కు చేరాడు. రెండో రౌండ్ మ్యాచ్లో సాయి ప్రణీత్ 21-15, 21-7 తేడాతో బీఆర్ సంకీర్త్(కెనడా)ను ఓడించి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించాడు.
ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ప్రణీత్ అంచనాలకు అనుగుణంగా రాణించాడు. అతను ప్రిక్వార్టర్స్లో జపాన్ క్రీడాకారుడు కుజుమసా సాకై(జపాన్)తో తలపడనున్నాడు. మరోవైపు పురుషుల సింగిల్స్లో హెఎస్ ప్రణయ్, ప్రతుల్ జోషి, అజయ్ జయరామ్లో ప్రిక్వార్టర్స్లోకి చేరగా, మహిళల సింగిల్స్ లో తన్వి లేడ్, రుత్విక శివానిలు ప్రిక్వార్టర్ రౌండ్ లో ప్రవేశించారు.