సెమీస్ కు దూసుకెళ్లిన అమెరికా | US overcome Ecuador to enter Copa America semis | Sakshi
Sakshi News home page

సెమీస్ కు దూసుకెళ్లిన అమెరికా

Published Sat, Jun 18 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

సెమీస్ కు దూసుకెళ్లిన అమెరికా

సెమీస్ కు దూసుకెళ్లిన అమెరికా

కోపా అమెరికా కప్ క్వార్టర్స్‌లో ఈక్వెడార్‌పై విజయం
 
సీటెల్: కోపా అమెరికా సెంటినరీ కప్‌లో ఆతిథ్య అమెరికా జట్టు దుమ్ము రేపుతోంది. వెటరన్ ఫార్వర్డ్ ఆటగాడు క్లింట్ డెంప్సీ తన సూపర్ ఫామ్‌ను మరోసారి చాటుకోవడంతో పాటు జట్టును సెమీఫైనల్స్‌కు చేర్చాడు. గురువారం ఈక్వెడార్‌తో హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ఫైనల్లో అమెరికా 2-1తో విజయాన్ని అందుకుంది. 1995 అనంతరం ఈ టోర్నీలో అమెరికా సెమీస్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. శనివారం అర్జెంటీనా, వెనిజులా మధ్య జరిగే క్వార్టర్స్ మ్యాచ్ విజేతతో ఈ జట్టు సెమీస్‌లో తలపడుతుంది. 22వ నిమిషంలోనే గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించిన డెంప్సీకి ఈ టోర్నీలో ఇది మూడో గోల్. గ్యాసీ జార్డెస్ (65) మరో గోల్ సాధించాడు. ఈక్వెడార్ నుంచి మైకేల్ అరోయో (74) ఏకైక గోల్ చేశాడు.


 మ్యాచ్ ఆరంభంలో అమెరికా జోరును కనబరిచింది. ఈక్వెడార్ డిఫెన్స్‌ను ఏమార్చుతూ స్ట్రయికర్ బాబీ వుడ్ వేగవంతమైన ఆటను ప్రదర్శించినా గోల్స్ మాత్రం నమోదు కాలేదు. అయితే 22వ నిమిషంలో జెర్నెన్ జోన్స్ ఇచ్చిన పాస్‌ను గాల్లోకి ఎగిరి హెడర్ ద్వారా డెంప్సీ గోల్ చేశాడు. మరో ఐదు నిమిషాల్లోనే డెంప్సీ ప్రమాదకర షాట్‌ను ఈక్వెడార్ కీపర్ అడ్డుకున్నాడు. అయితే ద్వితీయార్ధం ఆరంభం నుంచే ఈక్వెడార్ గోల్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 48వ నిమిషంలో ఎన్నెర్ వాలెన్సియా హెడర్ షాట్ కొద్దిలో మిస్సయ్యింది. 52వ నిమిషంలో ఇరు జట్లకు రిఫరీ షాక్ ఇచ్చారు. జెర్నెన్ జోన్స్ (అమెరికా) ప్రత్యర్థిని దురుసుగా అడ్డుకోవడంతో రెడ్ కార్డుకు గురికాగా ఆంటోనియో వాలెన్సియా (ఈక్వెడార్)కు రెండో ఎల్లో కార్డ్ చూపడంతో రెండు జట్లు పది మందితోనే మిగతా మ్యాచ్ ఆడాయి. 65వ నిమిషంలో డెంప్సీ అందించిన పాస్‌ను గోల్‌పోస్టుకు అత్యంత సమీపంలో అందుకున్న జార్డెస్ ఏమాత్రం పొరపాటు చేయకుండా జట్టు ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. అయితే కొద్దిసేపటికే ఈక్వెడార్ తమ ఏకైక గోల్ చేయగలిగింది.

74వ నిమిషంలో మైకేల్ అరోయో తక్కువ ఎత్తులో సంధించిన షాట్ గోల్‌పోస్టులోకి దూసుకెళ్లింది. మరో రెండు నిమిషాల్లోనే ఎన్నెర్ వాలెన్సియా హెడర్ అతి సమీపం నుంచి వెళ్లిపోవడంతో అమెరికా ఊపిరిపీల్చుకుంది. ఇంజ్యూరీ సమయంలోనూ ఈక్వెడార్ శాయశక్తులా గోల్ కోసం ప్రయత్నించినా అదృష్టం కలిసిరాలేదు. చివర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈక్వెడార్ కోచ్ గుస్తావో క్వింటెరోస్‌కు సైతం రిఫరీ రెడ్ కార్డ్ చూపించి స్టాండ్స్‌లోకి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement