బోల్ట్ ఇన్.. గాట్లిన్ అవుట్!
రియో డీ జనీరో: ఒకరు జమైకా దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ అయితే, మరొకరు అమెరికా స్టార్ స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్. ఇద్దరూ రేసులో దిగారంటే పసిడి పోరు ఆసక్తికరంగా సాగుతుంది. రియో ఒలింపిక్స్ 100 మీటర్ల రేసులో కూడా ఇదే ఆవిష్కృతమైంది. బోల్ట్ స్వర్ణం సాధిస్తే.. గ్లాటిన్ రజతం సాధించాడు. అయితే 200 మీటర్ల ఫైనల్ రేసుకు వచ్చేసరికి మాత్రం గాట్లిన్ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం ఇద్దరు మాత్రమే అర్హత సాధించే సెమీస్ పోరులో ఉసేన్ బోల్ట్ ప్రథమ స్థానంలో నిలవగా, కెనడా స్ప్రింటర్ ఆండ్రీ డీ గ్రాస్సె రెండో స్థానంతో తుది పోరుకు సిద్ధమయ్యాడు. దీంతో గాట్లిన్ కు నిష్క్రమణ తప్పలేదు.
ఈ రేసును 19.78 సెకెండ్లలో బోల్ట్ పూర్తి చేయగా, డీ గాస్సె 19.80 సెకెండ్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంతో ఫైనల్ రౌండ్ కు ప్రవేశించాడు. కాగా, గాట్లిన్ 20.13 సెకెండ్లలో రేసును పూర్తి చేయడంతో ఫైనల్ కు క్వాలిఫై కాలేకపోయాడు. ఇప్పటికే 100 మీటర్ల రేసులో బోల్ట్ పసిడిని సాధించాడు. దీంతో 100 మీటర్ల రేసులో వరుసగా మూడో స్వర్ణం సాధించిన ఏకైక అథ్లెట్ గా రికార్డు సాధించాడు. మరోవైపు వరుసగా ఏడో పసిడిని కూడా బోల్ట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 200 మీటర్ల ఫైనల్ రేసుతో పాటు 4x100 పరుగులో బోల్ట్ పసిడిని సాధిస్తే ఒలింపిక్స్ లో అపజయం లేని ధీరుడిగా మిగిలిపోతాడు.