'నా కొడుకు బోల్ట్ సక్సెస్ మంత్రం అదే'
కింగ్స్టన్: స్ప్రింట్ విభాగాల్లో వరుసగా మూడో ఒలింపిక్ స్వర్ణంపై గురి పెట్టిన ప్రపంచ చాంపియన్ ఉసేన్ బోల్ట్ కూల్ గా రికార్డులు బద్దలు కొట్టడానికి కారణం ఏంటో తెలుసా?, అతని చిరునవ్వేనట. ఈ విషయాన్ని ఉసేన్ బోల్ట్ తల్లి జెన్నీఫర్ బోల్ట్ స్పష్టం చేశారు. తన కొడుకు బోల్డ్ ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే అతన్ని చాంపియన్గా నిలబెడుతుందని జెన్నీఫర్ తెలిపారు. అదే అతని సక్సెస్ కు ప్రధాన కారణమన్న జెన్నీఫర్.. వచ్చే ఒలింపిక్స్లో కూడా బోల్ట్ కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా చాలా సానుకూలంగా ఆలోచించే ధోరణి బోల్ట్ కు తన నుంచే వచ్చిందని ఇటీవల ఓ ఇంటర్య్వూలో పేర్కొన్న జెన్నీఫర్.. అదే విషయాన్ని తన కొడుక్కి పదే పదే చెబుతుంటానని పేర్కొన్నారు. 'రియో గేమ్స్కు బోల్ట్ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాడు. ఆ గేమ్స్లో బోల్ట్ నుంచి మెరుగైన ప్రదర్శన ఉంటుందని తెలుసు. కేవలం ఆటపై మాత్రమే ఫోకస్ చేయమని నా కొడుక్కి చెప్పా. దేవుడ్ని ఎప్పుడూ మరవద్దని తెలిపా. బైబిల్ను చదువుకోమని చెప్పా'అని జెన్నీఫర్ తెలిపారు.
100 మీటర్ల, 200 మీటర్ల పరుగులో వరల్డ్ రికార్డులు సృష్టించిన బోల్ట్.. ఇప్పటివరకూ రెండు ఒలింపిక్స్లో పాల్గొని ఆరు స్వర్ణాలను కైవసం చేసుకున్నాడు. రియో అర్హతలో భాగంగా జమైకా జాతీయ మీట్ నుంచి గాయం కారణంగా అర్థాంతరంగా వైదొలిగిన బోల్ట్.. ఆ తరువాత లండన్లో జరిగిన డైమండ్ లీగ్ ద్వారా ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. జూలై 22 వ తేదీన జరిగిన 200 మీటర్ల రేసులో బోల్ట్ సత్తా చాటి రియోకు సిద్ధమయ్యాడు.