
జోరుమీద యువ భారత్
ఉ. గం. 11.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్ -2లో ప్రత్యక్ష ప్రసారం
దుబాయ్ : డిఫెండింగ్ చాంపియన్ యువ భారత్‌కు అండర్-19 ప్రపంచకప్‌లో అగ్నిపరీక్ష ఎదురుకానుంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపుమీదున్న భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. విజయ్ జోల్ సారథ్యంలోని జట్టు ఇంగ్లండ్‌తో పోలిస్తే పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ కుర్రాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. బ్యాటింగ్‌లో ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సంజు శామ్సన్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
ప్రపంచకప్‌లో శామ్సన్ ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలు చేశాడు. గినియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అయితే అతడు చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ శామ్సన్ అదే జోరు కొనసాగిస్తాడని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఓపెనర్లు అంకుశ్ బైన్స్, అఖిల్ హర్వాద్కర్ గత మ్యాచ్‌లో రాణించారు. వీరికి తోడు కెప్టెన్ జోల్ కూడా సత్తా చాటితే ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు తప్పవు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఈటోర్నీలో తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ అతడు కీలక పాత్ర పోషిస్తాడని అంచనా వేస్తున్నారు.
మిగిలిన వాళ్లు కూడా గాడిలో పడితే ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పవు. మరోవైపు ఇంగ్లండ్‌పై రికార్డులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. భారత్ 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఇంగ్లండ్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో నెగ్గింది. అలాగని ఇంగ్లండ్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. లీగ్ దశలో ఆ జట్టు న్యూజిలాండ్, యూఏఈలపై భారీ తేడాతో విజయం సాధించింది. శ్రీలంకతో మ్యాచ్‌లో మాత్రం ఒక వికెట్ తేడాతో ఓడింది. శనివారం జరిగే మరో క్వార్టర్ ఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక తలపడతాయి.